CONGRESS: మూసీ ప్రక్షాళన.. ఓ యజ్ఞం

CONGRESS: మూసీ ప్రక్షాళన.. ఓ యజ్ఞం
X
విపక్షాల గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టండి... కాంగ్రెస్ నేతల పిలుపు

మూసీ ప్రక్షాళనపై విపక్షాలు చేస్తున్న గోబెల్స్‌ ప్రచారాన్ని తిప్పికొట్టాలని మూసీ పరీవాహక వాసులకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు పిలుపునిచ్చారు. మూసీ నీటిని పంటలకు వినియోగించడంతో దిగుబడి పడిపోతోందని తద్వారా ప్రజలకు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నాగోల్‌లో మూసీనది ప్రక్షాళనపై, ప్రభుత్వ ప్రణాళికపై అవగాహన సదస్సు నిర్వహించారు. దీనిపై రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు.

యజ్ఞంలా మూసీ ప్రక్షాళన

హైదరాబాద్‌లో హైడ్రా పనులు కొనసాగుతాయని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌ష కుమార్‌గౌడ్‌ కోరారు.హైడ్రా, మూసీ ప్రక్షాళన పనులు మహా యజ్ఞం లాంటివన్నారు. భవిష్యత్‌ అవసరాల కోసమే ఈ కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోందన్నారు. వీటిని ప్రజలు స్వాగతించి సహకరించాలని కోరారు. మూసీ ప్రక్షాళనతో ఢిల్లీకి రూ.30వేల కోట్ల ముడుపులు అందుతున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. మూసీ సుందరీకరణకు సంబంధించి ఇంకా డీపీఆర్‌యే సిద్ధం కాలేదని.. అలాంటప్పుడు ముడుపులు ఎలా ముడుతాయో కేటీఆర్‌ సమాధానం చెప్పాలన్నారు.

భవిష్యత్తు తరాల కోసమే మూసీ ప్రక్షాళన

మూసీ ప్రక్షాళన భావితరాల భవిష్యత్ కోసమేనని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. మూసీ నదిలో మంచినీటిని పారించడమే లక్ష్యంగా రేవంత్ సర్కారు ప్రయత్నిస్తుంటే.. ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ నది బ్యూటిఫికేషన్​కు ఈ నది పరీవాహక ప్రాంతంలోని రైతులు, ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు. మూసీపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నాగోల్ లో ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని మూసీ పరీవాహక ప్రాంత రైతులు, ప్రజలతో ఈ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన చామల మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే మూసీ మురికికూపంగా మారిందని ధ్వజమెత్తారు. మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మూసీ పరీవాహక ప్రాంతాలు దోమలకు అడ్డాగా మారాయని, దీనివల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు.

Tags

Next Story