తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కీలక సమావేశం

తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కీలక సమావేశం
నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల దరఖాస్తులు పరిశీలన

తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కీలకఘట్టం ప్రారంభమైంది. దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 25తో ముగియడంతో.. ఇవాళ వాటిని ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ-పీఈసీ పరిశీలించనుంది. పీఈసీ ఛైర్మన్‌ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల దరఖాస్తులు పరిశీలించనున్నారు. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక వెయ్యి 25 దరఖాస్తులందినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందులో 34 స్థానాలకు 10కిపైగా దరఖాస్తులు అందాయి.

అత్యధికంగా ఇల్లెందు స్థానానికి 36 మంది దరఖాస్తు చేశారు. కాంగ్రెస్‌లో వడపోత మొదలైంది. ఇందులో సింగిల్ నేమ్ తో వచ్చే నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి... హుజూర్నగర్ నుంచి ఉత్తంకుమార్ రెడ్డి.. కోదాడ నుంచి పద్మావతి, మధిర - భట్టి విక్రమార్క.. మంథని - శ్రీధర్ బాబు.. జగిత్యాల - జీవన్ రెడ్డి, ములుగు సీతక్క, భద్రాచలం - పొడెం వీరయ్య, సంగారెడ్డి - జగ్గారెడ్డి, నల్గొండ - కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలంపూర్ - సంపత్ కుమార్, నాగార్జునసాగర్- కుందూరు జైవీర్ రెడ్డి, కామారెడ్డి - షబ్బీర్ అలీ, మంచిర్యాల - ప్రేమ్ సాగర్ రావు, ఆందోల్ - దామోదర రాజనర్సింహ, పరిగి - రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ - గడ్డం ప్రసాద్ కుమార్, ఇబ్రహీం పట్నం - మల్ రెడ్డి రంగారెడ్డి, ఆలేరు నుంచి బీర్ల ఐలయ్య పేర్లు మాత్రమే ఫైనల్‌ చేసే అవకాశం ఉంది.


ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాలకు భారీ పోటీ ఉన్నట్లు దరఖాస్తుల పరిశీలనలో గుర్తించారు. బీసీ వర్గాలకు చెందినవారు సైతం పెద్దసంఖ్యలో దరఖాస్తులిచ్చారు. పార్టీ కచ్చితంగా గెలిచే అవకాశాలున్నాయని అంతర్గత సర్వేల్లో గుర్తించిన నియోజకవర్గాలకు బీసీ, ఓసీ అభ్యర్థులు ఎక్కువగా పోటీపడుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధి ఎల్బీనగర్‌లో కాంగ్రెస్‌ గెలిచే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ స్థానం నుంచి టికెట్‌ కోరుతూ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రచార కమిటీ ఛైర్మన్‌, మాజీ ఎంపీ మధుయాస్కీ దరఖాస్తు ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్‌ తరఫున సుధీర్‌రెడ్డి నెగ్గారు. ఆయన బీఆర్‌ఎస్‌లో చేరడంతో.. కొత్త అభ్యర్థిని కాంగ్రెస్‌ ఎంపిక చేయాల్సి ఉంది.

ఈసారి కూడా ఇక్కడ కాంగ్రెస్‌కు మంచి అవకాశాలున్నాయని భావిస్తున్నందునే మధుయాస్కీ బరిలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో బీసీ వర్గాలు ఎక్కువగా ఉన్నాయి. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున బీసీ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య నెగ్గారు. ఈసారి బీసీలకు ఇస్తే గెలుపు అవకాశాలున్నాయని ఈ వర్గం నేతలు చెబుతున్నారు. అయితే ఇప్పటికే అక్కడ మరో ముగ్గురు నేతలు టికెట్‌ ఆశిస్తున్నందున రసవత్తరంగా మారింది. అలాగే సికింద్రాబాద్‌, సనత్‌నగర్‌, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌ తదితర స్థానాలకూ బీసీ వర్గాల నేతలు ఎక్కువగా దరఖాస్తులిచ్చారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వం లేనివారు సైతం కొందరు టికెట్‌ కోరుతూ అర్జీలు ఇచ్చారు. ఇలాంటి వారి పేర్లతో విడిగా జాబితా తయారుచేస్తున్నారు. వారికి క్షేత్రస్థాయిలో ఉన్న బలంపై పీఈసీలో చర్చించనున్నారు.

ఎన్ని దరఖాస్తులొచ్చినా ఒక్కో స్థానానికి బలమైన ముగ్గురు అభ్యర్థుల పేర్లతో జాబితా తయారుచేయాలని పార్టీ అధిష్ఠానం సూచించింది. ఈ ముగ్గురితో పాటు ఇతర దరఖాస్తుదారులకు క్షేత్రస్థాయిలో ఉన్న బలంపై వారం, పదిరోజుల్లో అంతర్గత సర్వే చేయించనున్నారు. ఈ సర్వే ఫలితాల ఆధారంగా స్క్రీనింగ్‌ కమిటీ.. ఆయా అభ్యర్థుల బలాబలాలను వివరిస్తూ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదిక పంపుతుంది. అక్కడ చర్చించాక తుది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌ అధిష్ఠానం విడుదల చేస్తుంది. సెప్టెంబరు 15 నాటికి 60 నుంచి 75 స్థానాలకు, నెలాఖరుకల్లా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని అంచనా.

కాంగ్రెస్‌లో ప్రారంభమైన అభ్యర్థుల వడపోత

సింగిల్‌ నేమ్‌తో నియోజకవర్గాల అభ్యర్థులు...

1.కొడంగల్ - రేవంత్ రెడ్డి

2.హుజూర్‌నగర్‌- ఉత్తంకుమార్ రెడ్డి

3.కోదాడ - పద్మావతి

4.మధిర - భట్టి విక్రమార్క

5.మంథని - శ్రీధర్ బాబు 6.జగిత్యాల - జీవన్ రెడ్డి

7.ములుగు సీతక్క

8.భద్రాచలం - పొడెం వీరయ్య

9.సంగారెడ్డి - జగ్గారెడ్డి

10.నల్గొండ - కోమటిరెడ్డి వెంకటరెడ్డి

11. అలంపూర్ - సంపత్ కుమార్

12. నాగార్జునసాగర్ కుందూరు జైవీర్ రెడ్డి

14. కామారెడ్డి - షబ్బీర్ అలీ

15. మంచిర్యాల - ప్రేమ్ సాగర్ రావు

16. ఆందోల్ - దామోదర రాజనర్సింహ

17. పరిగి - రామ్మోహన్ రెడ్డి

18. వికారాబాద్ - గడ్డం ప్రసాద్ కుమార్

19. ఇబ్రహీం పట్నం - మల్ రెడ్డి రంగారెడ్డి

20. ఆలేరు - బీర్ల ఐలయ్య

Tags

Next Story