ఎన్నికలే లక్ష్యం... తెలంగాణ కాంగ్రెస్ లో దూకుడు

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది. కర్నాటక విక్టరీతో జోష్ మీదున్న కాంగ్రెస్ శ్రేణులు.. అదే ఊపును కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. బీఆర్‌ఎస్, బీజేపీలో అసంతృప్తులకు గాలం వేసేందుకు స్కెచ్ వేస్తున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు హస్తం పార్టీ నేతలకు టచ్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్య నాయకుల చేరికలన్నీ నేరుగా కాంగ్రెస్ హైకమాండ్ కన్నుసన్నల్లో జరుగుతున్నాయి. ఇప్పటికే కొందరు నాయకులు హస్తం పార్టీలో చేరేందుకు సుముఖత తెలుపగా.. మరికొందరు నేతలు సైతం అదేబాటలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ఈ నెలాఖరులో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌గాంధీ... భారత్‌కు తిరిగి వచ్చాక ముగ్గురు నేతలు ఆయనతో స్వయంగా భేటీ కానున్నారు. ఈ నెల 22న రాహుల్ భారత్‌కు తిరిగొస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. నెలాఖరున ఖమ్మంలో జరగనున్న భారీ బహిరంగ సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. నాగర్‌కర్నూలులో జరిగే సభలో జూపల్లి కృష్ణారావు, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత నాగర్ కర్నూలు టికెట్ విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తెలంగాణలో అధికారం సాధించాలంటే రాష్ట్ర, నియోజకవర్గ స్థాయుల్లో ప్రభావం చూపగల ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం తప్పనిసరి అని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. రాష్ట్రంలో బీజేపీని పరిమితం చేసి.. బలంగా ఉన్న అధికార బీఆర్‌ఎస్‌ను ఢీ కొట్టాలంటే.. నియోజకవర్గాల స్థాయిలో పార్టీలో చేరికలను ముమ్మరం చేయాలని చూస్తోంది. బీఆర్‌ఎస్, బీజేపీలో అసంతృప్తిగా ఉన్న నాయకులతోనూ కాంగ్రెస్ చర్చలు జరుపుతోంది. ఈ దఫా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు కష్టమేనన్న బీఆర్‌ఎస్ హైకమాండ్ సంకేతాలతో.. పలువురు నాయకులు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. వీరిలో గెలుపు గుర్రాలుగా భావిస్తున్న బలమైన నేతలకు హస్తం పార్టీ గాలం వేస్తోంది. ఇందు కోసం కొన్ని ప్రత్యేక టీమ్‌లు రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిన ఆవశ్యకతను.. పార్టీలో దక్కే ప్రాధాన్యాన్ని నేతలకు వివరిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కీలకంగా మారనున్నారు. డీకేను కాంగ్రెస్ హైకమాండ్ ఎన్నికల అబ్జర్వర్‌గా నియమిస్తుందని ప్రచారం జరుగుతోంది. చేరికల నుంచి.. మొత్తం పార్టీ వ్యవహారాల వరకు అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. టి.కాంగ్రెస్ చేరికల విషయంలో డీకే యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. నాయకులను ఏకతాటిపై నడిపించే బాధ్యత, ఆర్థికంగా అండదండలు అందించడం తదితర వ్యవహారాలను డీకే శివకుమార్ చూసుకోనున్నట్లు తెలుస్తోంది. వారంలో రెండు రోజులు తెలంగాణ పార్టీ వ్యవహారాలపై చెబుతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ కూడా తరుచూ బెంగళూరు వెళ్లి డీకేతో భేటీ అవుతున్నారు. బీఆర్‌ఎస్, బీజేపీని ఎదుర్కొనే విషయంలో సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోనూ కర్నాటక తరహా ఫార్ములాను అమలు చేయాలని చూస్తున్నారు. ఈ వ్యూహాల అమల్లో సంపూర్ణ అనుభవం, అవగాహన ఉన్న డీకే శివకుమార్‌ను అబ్జర్వర్‌గా దింపితే అన్ని విధాలుగా కలిసివస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com