వేగం పెంచిన టీ-కాంగ్రెస్.. ప్రియాంకతో మలిసభ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల విజయం ఇచ్చిన ఉత్సాహంతో తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ తన కార్యక్రమాల వేగం పెంచింది. రాష్ట్రంలో వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ వాటికి ఏఐసీసీ అగ్రనాయకులు హాజరయ్యేలా ప్లాన్ చేసుకుంటోంది. ఇందులో భాగంగా తెలంగాణలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో మలిసభను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. జూన్ చివరి వారం గానీ జూలై మొదటి వారంలో గానీ ప్రియాంక గాంధీ సభ ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
తెలంగాణలో ప్రియాంక తొలి సభ ఇటీవలే హైదరాబాద్‌లో నిర్వహించారు. ఆ సభలో యూత్ డిక్లరేషన్‌ను ప్రకటించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రియాంక మలి సభను మెదక్ జిల్లాలో నిర్వహించేందుకు టీపీసీసీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో రైతు డిక్లరేషన్‌ను రేవంత్ రెడ్డి ప్రకటించారు. బీసీ, మహిళ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ తదితర వర్గాలకు సంబంధించి డిక్లరేషన్లపైనా టీపీసీసీ కసరత్తు చేస్తోంది. మెదక్‌లో జరిగే ప్రియాంక సభలో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే వరుస కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉండేలా పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
మరోవైపు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణపై చర్చించేందుకు రేవంత్ అధ్యక్షతన రేపు గాంధీ భవన్‌లో టీపీసీసీ విస్తృత సమావేశం జరగనుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా జూన్ రెండున గ్రామ గ్రామానా ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. రాష్ట్రస్థాయి కార్యక్రమానికి ఏఐసీసీ ముఖ్య నేత ఒకర్ని ఆహ్వానించాలనుకుంటున్నారు. ఈ అంశాలపైన చర్చించి కార్యక్రమాలు రూపొందించనున్నారు. బీసీ, మహిళ, ఎస్సీ, ఎస్టీ తదితర డిక్లరేషన్లపైన, భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాలపైనా చర్చిస్తారు. మరికొద్ది నెలల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఎన్నికల సన్నాహక సమావేశంగానూ ఇది జరుగుతుందని చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com