T-Congress: సీనియర్ల అసమ్మతికి ఈరోజు సీక్వెల్ ఎపిసోడ్..

T-Congress: కాంగ్రెస్‌లో సీనియర్ల అసమ్మతికి ఇవాళ సీక్వెల్ ఎపిసోడ్ జరగబోతోంది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తీరును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ సీనియర్ లీడర్లు.. ఇవాళ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి ఇంట్లో సమావేశం అవుతున్నారు.
మొన్న భట్టి విక్రమార్క నివాసంలో జరిగిన సమావేశానికి హాజరైన వాళ్లే కాకుండా.. మరికొంత మంది సీనియర్లు సైతం ఈ సమావేశానికి హాజరవుతారనే అంచనాలున్నాయి. మరోవైపు సీనియర్ల ఆగ్రహాన్ని చల్లార్చడానికి వచ్చిన ఏఐసీసీ సెక్రటరీ నదీం జావేద్ కూడా చేతులెత్తేసే పరిస్థితి కనిపిస్తోంది.
ఇవాళ మహేశ్వర్ రెడ్డి ఇంట్లో జరిగే సమావేశాన్ని రద్దు చేసుకోవాలని, హైకమాండ్‌కు విషయం వదిలేయాలని నదీం జావెద్ కోరినట్లు తెలిసింది. కానీ కాంగ్రెస్ సీనియర్లు మాత్రం వెనక్కి తగ్గేదే లేదంటున్నారు.
పైగా ఇవాళ్టి సమావేశానికి మొన్న హాజరైన నేతలతోపాటు మరికొందరు జతకూడుతారని కాంగ్రెస్ వర్గాల నుంచి లీక్‌లు వచ్చాయి. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మీటింగ్ జరిగి తీరుతుందని చెబుతున్నారు.
రేవంత్‌రెడ్డిపై సీనియర్ల తిరుగుబాటును పార్లమెంట్ సమావేశాల తరువాతే పరిష్కరించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం శీతాకాల సమావేశాలతో బిజీగా ఉన్న అధిష్టానం.. పార్లమెంట్ సెషన్స్ ముగిసిన వెంటనే తెలంగాణ కాంగ్రెస్ గొడవపై దృష్టి పెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ పంచాయితీ ఢిల్లీలోనే పరిష్కారం అవుతుందని, ఢిల్లీలోనే మీటింగ్ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పార్టీ పదవుల విషయంలో కొందరికి అసంతృప్తి ఉన్న మాట నిజమేనన్నారు ఏఐసీసీ సెక్రటరీ నదీం జావెద్. అయితే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సింది కాదని అభిప్రాయపడ్డారు.
ఏమైనా ఇబ్బంది ఉంటే పార్టీ అంతర్గత వేదికలపై మాట్లాడొచ్చని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఏఐసీసీ దృష్టికి వెళ్లాయని తెలిపారు. త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్‌లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని నదీం జావెద్ చెప్పుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com