Telangana Congress: పెద్దలు వచ్చి సర్ధి చెప్పినా.. నేతల తీరు మారునా!!

Telangana Congress: పెద్దలు వచ్చి సర్ధి చెప్పినా.. నేతల తీరు మారునా!!
Telangana Congress: టీ కాంగ్రెస్‌లో పంచాయితీని సద్దుమణిగించేందుకు వచ్చిన దిగ్విజయ్‌సింగ్‌ తన పని మొదలుపెట్టారు.

Telangana Congress: టీ కాంగ్రెస్‌లో పంచాయితీని సద్దుమణిగించేందుకు వచ్చిన దిగ్విజయ్‌సింగ్‌ తన పని మొదలుపెట్టారు. గాంధీభవన్‌లో పార్టీ నేతల వాదనలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకూ నేతలకు సమయం ఇచ్చి, వారు చెప్పిందంతా ఓపిగ్గా విన్నారు. ఒక్కో నేతతో ముఖాముఖి మాట్లాడిన దిగ్విజయ్‌.. వారు చెప్పిందంతా ఆలకించారు. టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కార్యనిర్వాహక అధ్యక్షులు దిగ్విజయ్‌సింగ్‌కు తమ వాదనలు వినిపించారు.


''అసలు మీ సమస్య ఏంటి? మీరు సూచించే పరిష్కారం ఏంటి? పార్టీలో సమన్వయానికి ఏం చేస్తే బాగుంటుంది?'' వంటి ప్రశ్నలు సంధించారు దిగ్విజయ్ సింగ్. అయితే సీఎల్పీ నేత భట్టివిక్రమార్కతో దిగ్విజయ్‌ గంటకుపైగా భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే వీహెచ్‌, మహేశ్వర్‌రెడ్డి తదితర అసంతృప్త నేతలూ దిగ్విజయ్‌ను కలిసి తమ అభిప్రాయాలు చెప్పారు. అసంతృప్త సీనియర్లు ప్రధానంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిల వ్యవహార శైలిని తప్పు పడుతూ నివేదికలు సమర్పించినట్లు తెలిసింది.


ఇదిలా ఉంటే రేవంత్‌ వర్గం నేతలూ తమ వాదనలు వినిపించారు. తమను వలస నేతలంటూ మాట్లాడడం సరైంది కాదంటూ దిగ్విజయ్‌కు సీతక్క వివరించారు. తాము పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే తప్పు పట్టాలి కానీ.. వలస వాదులని మాట్లాడడమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీలో కోవర్టులు ఎవరూ లేరని, అది అపోహ మాత్రమేనని జానారెడ్డి అన్నారు. దిగ్విజయ్‌తో సమకాలీన రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై చర్చించామని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క చెప్పారు.


దిగ్విజయ్‌తో భేటీ అయి తమ అభిప్రాయాలు వెల్లడించేందుకు నేతలు, వారి అనుచరుల రాకపోకలతో చాలా కాలం తర్వాత గాంధీభవన్‌ కళకళలాడింది. ఇదిలా ఉంటే అభిప్రాయ సేకరణ పూర్తి చేసిన దిగ్విజయ్‌.. ఇవాళ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడనున్నారు. అనంతరం ఢిల్లీకి వెళ్లి.. ఇరు వర్గాల అభిప్రాయాలను అధిష్ఠానం నేతలకు తెలియజేయనున్నారు.


అయితే ఢిల్లీ పెద్దలు వచ్చినా.. కాంగ్రెస్‌లో కొట్లాటలు తగ్గడం లేదు. దిగ్విజయ్ సింగ్ గాంధీ భవన్‌లో కాంగ్రెస్ సీనియర్ లీడర్లతో మాట్లాడుతున్న సమయంలోనే.. బయట కాంగ్రెస్ నేతల మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఓయూ నుంచి వచ్చిన విద్యార్థి నేతలు.. మాజీ ఎమ్మెల్యే అనిల్ వర్గంతో వాగ్వాదానికి దిగారు. పార్టీ సీనియర్లు ఉత్తమ్ కుమార్, హనుమంతరావు, భట్టివిక్రమార్క, దామోదర రాజనరసింహ వంటి సీనియర్ నేతలను.. కోవర్టులు అని అనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.



రేవంత్ రెడ్డి సీనియర్లకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. ఐతే అక్కడే ఉన్న అనిల్.. ఎవరికి అన్యాయం జరిగిందని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే మాటా మాటా పెరిగింది. ఇరువర్గాలు పరస్పరం తోసుకున్నారు. గల్లాలు పట్టుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే సీనియర్ నేత మల్లు రవి కలగజేసుకొని.. ఇరువర్గాలకు సర్ధిచెప్పారు.


కాంగ్రెస్‌ పార్టీలో చాలా రోజులుగా అంతర్గత పోరు నడుస్తున్నా.. ఇటీవల ప్రకటించిన కమిటీలతో అది తారాస్థాయికి చేరింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కమిటీలో వలస నేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని.. రేవంత్ రెడ్డి తమ టీడీపీ నుంచి వచ్చిన తమ వర్గం వారికే ప్రాధాన్య ఇస్తున్నారని.. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీ, దామోదర రాజనరసింహ, జగ్గారెడ్డి వంటి నేతలు మండిపడ్డారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్‌కు కూడా వారంతా గైర్హాజరయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి వర్గం నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. పార్టీలో ఉన్న సమస్యలను హైమాండ్ పరిష్కరిస్తుందని.. అందరం కలిసి కట్టుగా పనిచేసి.. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని రేవంత్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story