TG: భగ్గుమంటున్న తెలంగాణ

గడిచిన పదేళ్లలో లేనంతగా తెలంగాణ భగ్గుమంటోంది. ఏప్రిల్ మొదటి వారం నుంచే వడగాలులు తీవ్రస్థాయిలో వీస్తుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే వేడి ప్రారంభమై మధ్యాహ్నం 12 తర్వాత బయటకు రాలేనంత తీవ్రమవుతోంది. అధిక ఉష్ణోగ్రతలతో ఆదివారం 9 జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఈ జిల్లాల్లోని 34 మండలాల్లో రికార్డుస్థాయిలో వడగాలులు నమోదయ్యాయి.
తెలంగాణ వ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గతేడాది ఉష్ణోగ్రతల కన్నా ప్రస్తుతం దాదాపు అన్ని జిల్లాల్లో 3.5 డిగ్రీలపైనే అధికంగా నమోదవుతున్నాయి. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పులు రావడంతోనే ప్రస్తుతం వాతావరణంలో వేడి అమాంతంగా పెరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నెలలో మున్ముందు మరింత తీవ్రత ఉండే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో వడగాలులు వీస్తాయని, వృద్ధులు, బాలింతలు, పిల్లలతోపాటు పక్షులపైనా ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ఈ అధిక ఉష్ణోగ్రతలతో ఏర్పడే అల్పపీడనం కారణంగా.. సోమవారం నుంచి ఈ నెల 11 వరకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఈ ఏడాది తీవ్రమైన వేడితో ఉమ్మడి నల్గొండ జిల్లా కుదేలవుతోంది. తెలంగాణలో మొదటిసారిగా మార్చి 30న వేములపల్లి, నిడమనూరు మండలాల్లో వడగాలులు వీచాయి. ఈ నెల 6న మునుగోడు, వేములపల్లి, వలిగొండ, బొమ్మలరామారం మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం నల్గొండ జిల్లాలోని 10 మండలాల్లో, సూర్యాపేట 8, కొత్తగూడెం 3, జనగామ 2, గద్వాల 2, ఖమ్మం 2, మంచిర్యాల 2, సిద్దిపేట 3, యాదాద్రి రెండు మండలాల్లో వడగాలులు వీచాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని తొగర్రాయికి చెందిన కన్నెబోయిన కోటమ్మ ఆదివారం వ్యవసాయ పనులకు వెళ్లి వడదెబ్బతో మృతిచెందింది. ఖమ్మం నగరంలోనూ 5 రోజులుగా సాధారణం కన్నా 5 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. SPOT
తెలంగాణలో గడిచిన 60 ఏళ్ల సగటు ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి. అప్పటి కంటే సాధారణ గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 0.3- 3.5 డిగ్రీల చొప్పున పెరిగాయి. ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దం ముగిసే నాటికి 2- 4 డిగ్రీలు పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. పారిశ్రామికీకరణ, కర్బన ఉద్గారాల కారణంగా హైదరాబాద్‌కే ప్రత్యేకమైన సమశీతల వాతావరణం కూడా క్రమంగా దెబ్బతింటోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com