TS: తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు

తెలంగాణలో ఇవాళ, రేపు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినట్లు పేర్కొంది. తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం గుండా రుతుపవన ద్రోణి ఒకటి వెళ్తున్నట్లు సూచించింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా ములుగు జిల్లా మల్లంపల్లిలో 12.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా గాంధారిలో 8.6, హనుమకొండ జిల్లా శాయంపేటలో 8.6, జయశంకర్ జిల్లా పలిమెల మండలం సర్వాయిపేటలో 8 సెం.మీ. వర్షం కురిసింది.
తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్, డీజీపీ జితేందర్, ప్రణాళికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా కలెక్టర్లు, ఎస్పీలు ఇతర అధికారులతో సమీక్షించారు. వర్షాలపై సీఎం రేవంత్‌రెడ్డి నిరంతరం సమీక్షిస్తున్నారని... జిల్లాల్లో ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం సంభవించొద్దని ఆదేశించారు. క్షేత్రస్థాయి అధికారులంతా అందుబాటులో ఉండి సమన్వయంతో వీలైనంత వేగంగా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. పునరావాస కేంద్రాల ఏర్పాటుపై ముందుగా దృష్టి పెట్టాలని... భద్రాద్రి, ములుగు జిల్లాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూంలను సిద్ధం చేయాలని సీఎస్ నిర్దేశించారు. ఎవరూ వాగులు దాటకుండా బందోబస్తు ఉంచాలన్నారు.
పోలీసు కమిషనర్లు, ఎస్పీలు కలెక్టర్లతోపాటు ఇతర యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నారని డీజీపీ వెల్లడించారు. ఇప్పటి వరకు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని తెలిపారు. భద్రాద్రి జిల్లాలో దెబ్బతిన్న గృహాలు ఇతర నష్టాలపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించినట్లు తెలిపారు. ములుగు జిల్లా పరిధిలో 77 గ్రామాలను సమస్యాత్మకంగా గుర్తించామని, అన్నిచోట్లా ఒక సమాచార అధికారిని ఏర్పాటు చేశామని వివరించారు.
ఎగువనzమహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లతోపాటు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రాణహిత, ఇంద్రావతి, కిన్నెరసాని, తాలిపేరు ఉపనదుల నుంచి గోదావరికి వరద పోటెత్తుతోంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి 48 అడుగులను దాటింది. సాయంత్రం 6 గంటలకు 49.10 అడుగులకు చేరుకుంది. మంగళవారం ఉదయానికి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి 53 అడుగులు దాటుతుందని అంచనా వేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com