CS: 2 వేల మందితో ఎస్డీఆర్ఎఫ్

తెలంగాణలో ఇటీవల వరదలు బీభత్సం సృష్టించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. భవిష్యత్తులో ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు చర్యలకు ఉపక్రమించింది. ఇటీవల ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో భారీ వరదలు చోటు చేసుకున్న నేపథ్యంలో.. సుశిక్షితులైన సిబ్బందితో ఎస్డీఆర్ఎఫ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ విపత్తుల నిర్వహణ బృందం ఏర్పాటుపై సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక సీఎస్ అరవింద్ కుమార్, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తదితరులతో సమావేశం నిర్వహించారు.
రెండు వేలమందితో..
రెండు వేల మందితో రాష్ట్ర విపత్తుల నిర్వహణ బృందాన్ని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. అగ్నిమాపక శాఖ నుంచి 10 బృందాలు, రాష్ట్ర ప్రత్యేక పోలీసు విభాగం నుంచి 10 కంపెనీలకు చెందిన వెయ్యి మంది సిబ్బందిని కలిపి మొత్తం సుమారు 2 వేల మందితో కొత్త టీమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. నవంబరు మొదటి వారంలో మొదటి బ్యాచ్‌కు శిక్షణ ఇవ్వనున్నట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. ముఖ్యమంత్రి బడ్జెట్ కూడా విడుదల చేసినందున, వెంటనే ఎస్డీఆర్ఎఫ్ ఏర్పాటు చేసి సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. వరదలు, అగ్నిప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సమర్థంగా పనిచేసేలా శిక్షణ ఉండాలని పేర్కొన్నారు. ఏయే వాహనాలు, పరికరాలు ఎన్ని అవసరమో చర్చించారు. పది ఫైర్ స్టేషన్లను పూర్తిస్థాయి ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో నిర్వహించనున్నట్లు అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ బృందం, ఎన్డీఆర్ఎఫ్ నిపుణులతో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com