TG: ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో తెలంగాణ ప్రభుత్వం దూకుడు

ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. విచారణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ఆ దిశగా కీలక ముందడుగు వేసింది. గవర్నర్ అనుమతి ఇచ్చిన లేఖను జతచేస్తూ తెలంగాణ సీఎస్ శాంతి కుమారి ఏసీబీకి లేఖ రాశారు. నిధుల దుర్వినియోగంపై విచారణ జరపాలని ఏసీబీకి రాసిన లేఖలో సీఎస్ పేర్కొన్నారు. ఈ-కార్ రేసింగ్ పూర్వాపరాలు, బీఆర్ఎస్, ప్రభుత్వ హయాంలో దీని నిర్వహణకు అప్పటి మంత్రి కేటీఆర్ తీసుకున్న చర్యలు, ప్రజాధనం ఎలా విడుదల చేశారు?, నిబంధనల ఉల్లంఘన ఎలా జరిగిందనే అంశాలపై లోతుగా విచారణ జరపాలని కోరారు. ఆర్‌బీఐ(RBI) అనుమతి లేకుండా విదేశీ కరెన్సీ చెల్లించడం, ముందుగా డబ్బు చెల్లించి.. రెండు వారాల తర్వాత ఒప్పందం చేసుకోవడం, అది కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఉల్లంఘించి చేసుకోవడం ఇలా అనేక అంశాలు ఇందులో జరిగిన అక్రమాలు జరిగాయని ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్నారు.
ఈ ఫార్మూలా కేసుపై తొలిసారి స్పందించిన కేటీఆర్
ఈ ఫార్మూలా కార్ రేస్ కేసులో తనను విచారించడానికి గవర్నర్ అనుమతించడంపై కేటీఆర్ తొలిసారి స్పందించారు. ఈ ఫార్మూలా కేసుపై శాసనసభలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అవినీతి ఆరోపణలపై కూడా సభలో చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. హామీల అమలుపైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారా అని ముఖ్యమంత్రి రేవంత్ ను కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు.
కేటీఆర్ అరెస్టు తథ్యమేనా...?
ఫార్ములా ఈ రేస్ కార్ల వ్యవహారంలో రూ. 50 కోట్ల గోల్ మాల్ ఘటనలో మాజీ మంత్రి కేటీఆర్ కు ఉచ్చు బిగుస్తోంది. కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదుకు గవర్నర్ అనుమతి మంజూరు చేయడంతో దర్యాప్తు అధికారులు విచారణను వేగవంతం చేశారు. శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ కేసు కీలక మలుపు తిరగనున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ ను దర్యాప్తు అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com