DSC: త్వరలో మరో డీఎస్సీ

తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. నిరుద్యోగులు ప్రస్తుత డీఎస్సీ పరీక్షలకు బాగా సిద్ధమై 11 వేల ఉపాధ్యాయ పోస్టులను పొందాలని, ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మరో నోటిఫికేషన్ జారీచేస్తామని భట్టి స్పష్టం చేశారు. ప్రస్తుతం పరీక్షలు జరగబోతున్న డీఎస్సీ నోటిఫికేషన్‌కు స్పందించి 2.79 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని... ఇప్పటికే 2.05 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారన్నారు. వీరికి ఏవైనా సమస్యలు ఎదురైతే పరిష్కారానికి 24 గంటలూ అందుబాటులో ఉండేలా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈనెల 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. పాఠశాలలపై మేం లోతుగా అధ్యయనం చేయగా ప్రస్తుతం వెలువరించిన 11వేల పోస్టులు భర్తీ అయిన తర్వాత కూడా మరో ఐదు వేల ఖాళీలు ఉంటాయని తేలిందని... వీటితోపాటు సమీప భవిష్యత్తులో ఏర్పడే మరికొన్ని ఖాళీలను కలిపి మరో డీఎస్సీ నిర్వహిస్తామని వెల్లడించారు.
నిరుద్యోగ ఉపాధ్యాయులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భట్టి విక్రమార్క వెల్లడించారు. భట్టి విక్రమార్క తమ ప్రభుత్వం తరచూ డీఎస్సీ నోటిఫికేషన్‌లు జారీచేస్తూనే ఉంటుందని డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఇటీవల తెలంగాణలో 19 వేల మందికిపైగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామన్నారు. ఏ చిన్న ఇబ్బంది లేకుండా 34 వేల మంది ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించామని భట్టి విక్రమార్క వెల్లడించారు. జాబ్ క్యాలెండర్ విడుదల ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో గ్రూప్ 1, గ్రూప్ 2, డీఎస్సీ ఉద్యోగాలనే భర్తీ చేయలేదని గుర్తు చేశారు. అప్పట్లో సీఎల్పీ నేతగా నేను పలుమార్లు ప్రభుత్వాన్ని అసెంబ్లీలో డిమాండ్ చేయగా నిరుద్యోగులు పెద్దఎత్తున ఆందోళన చేశారన్నారు.
చివరికి అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్‌లు ఇస్తే పరీక్ష పేపర్ లీకయిందని... కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ను విజయవంతంగా నిర్వహించామని భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం గ్రూప్-2 పరీక్షను మూడుసార్లు వాయిదా వేసిందని వివరించారు. మేం వచ్చే నెలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. గ్రూప్-3 పరీక్షలు వచ్చే నవంబరులో నిర్వహించేందుకు తేదీలు ఖరారు చేశాం. తెలంగాణ బిడ్డలు జీవితాల్లో స్థిరపడాలనేదే తమ ప్రభుత్వం ఆశని ఉప ముఖ్యమంత్రి భట్టి చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com