Maoist Surrender : తెలంగాణలో మావోయిస్టు ప్రభావం లేదు.. పార్టీ కుప్ప కూలే అవకాశం ఉంది : డీజీపీ మహేందర్ రెడ్డి

Maoist Surrender : తెలంగాణలో మావోయిస్టు ప్రభావం లేదు.. పార్టీ కుప్ప కూలే అవకాశం ఉంది : డీజీపీ మహేందర్ రెడ్డి
Maoist Surrender : 31 ఏళ్లుగా మావోయిస్టుగా పనిచేసిన ఆలూరి ఉషారాణి పోలీసుల ముందు లొంగిపోయింది

Maoist Surrender : 31 ఏళ్లుగా మావోయిస్టుగా పనిచేసిన ఆలూరి ఉషారాణి పోలీసుల ముందు లొంగిపోయింది. అనారోగ్య కారణాలతో జనజీవన స్రవంతిలోకి వెళ్తానని 2019 లో పార్టీకి సమాచారమివ్వడంతో... రెండున్నరేళ్ల తర్వాత పార్టీ ఆమోదంతో పోలీసుల ముందు లొంగిపోయింది. 1991 లో మునుగోడు దళంలో చేరిన ఉషారాణి.. పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేసింది. తన తల్లితండ్రులు పీపుల్స్ వార్ లో ఉండటంతో వారిని చూసి తాను కూడా మావోయిస్టు పార్టీలో జాయిన్ అయింది.

నాయకత్వ లోపం వల్ల మావోయిస్టు పార్టీ దానికదే కుప్పకూలుతుందన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. ఇప్పటికే ముగ్గురు సెంట్రల్ కమిటీ మెంబర్స్ అనారోగ్యంతో చనిపోగా.. మరో ఆరుగురు పోలీసుల ముందు లొంగిపోయారన్నారు.

తెలంగాణకు చెందిన 11 మంది సెంట్రల్ కమిటీ మెంబర్స్... అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మావోయిస్టు పార్టీలో రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయన్నారు. ఓవైపు సీనియర్ల నాయకత్వం లేక.. మరోవైపు కొత్తగా రిక్రూట్ అయిన వారికి పార్టీ ఐడియాలజీ తెలియక మావోయిస్టు పార్టీ కుప్పుకూలే అవకాశం ఉందన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి.

1991 లో మునుగోడు దళ సభ్యురాలుగా జాయిన్ అయిన ఉషారాణి... ఆ తర్వాత అంచెలంచలుగా ఎదిగి.. దండకారణ్య జోనల్ కమిటీ సభ్యురాలిగా పనిచేసిందన్నారు.. 1990 లో ఉషారాణికి ముక్క వెంకటేశ్వర్ గుప్తాకి పెళ్లి కాగా 1998 లో యాదగిరి గుట్టలో పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో చనిపోయారని తెలిపారు.. 2002 లో దండకారణ్య జోనల్ కమిటీలో జాయిన్ అయ్యి.. ఇప్పటివరకు అక్కడే పనిచేసిందన్నారు డీజీపీ.. మావోయిస్టు భావజాలాన్ని అందరికీ తెలియజేయడానికి ఉషారాణిని పొలిటికల్ టీచర్ ఇన్ మొబైల్ స్కూల్ కి ఇంచార్జిగా నియమించారన్నారు. గత కొన్నేళ్లుగా తన ఆరోగ్యం బాగాలేకపోవడంతో.. పార్టీకి సమాచారం ఇచ్చి పోలీసులకు లొంగిపోయిందని తెలిపారు.

తెలంగాణలో మావోయిస్టు ప్రభావం ఏమాత్రం లేదన్న డీజీపీ.. తెలంగాణ కమిటీ మెంబర్స్ అంతా ఛత్తీస్ఘడ్ లో ఉన్నారన్నారు. తెలంగాణ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తే తప్పకుండా వారిని పట్టుకుంటామని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story