సెప్టెంబరు 1 నుంచి తెలంగాణలో విద్యాసంస్థల పునఃప్రారంభం

TS Institutions Reopen: కోవిడ్ కారణంగా తెలంగాణలో మూతపడిన విద్యాసంస్థలు సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ పునఃప్రారంభం కానున్నాయి.. సెప్టెంబరు ఒకటి నుంచి విద్యాసంస్థల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇవాళ విద్యాసంస్థల పునఃప్రారంభంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది.. పాఠశాలలు తెరుచుకోవచ్చని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది. ఆ నివేదికపై సుదీర్ఘ చర్చ జరిగింది.. అనంతరం సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకున్నారు.
కరోనా ప్రభావంతో గత మార్చిలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. మధ్యలో తొమ్మిది ఆపై తరగతులు పాక్షికంగా ప్రారంభించగా.. రెండో దశ తీవ్రత పెరగడంతో మళ్లీ ఆన్‌లైన్ బోధనకే పరిమితం చేశారు. గత నెల ఒకటి నుంచే అన్ని తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం భావించినప్పటికీ హైకోర్టు సూచనలతో వెనక్కు తగ్గాల్సి వచ్చింది. కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే విద్యాసంస్థలు పునఃప్రారంభమయ్యాయి.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని సెప్టెంబరు 1 నుంచి తెలంగాణలో విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనకు అనుమతిచ్చింది ప్రభుత్వం.
అయితే, ఏ తరగతి నుంచి ప్రారంభించాలనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. 8 నుంచి ఆపై తరగతులకు ప్రత్యక్ష బోధన మొదలు పెడతారా, లేక అన్ని క్లాసులు స్టార్ట్ చేస్తారా అనేది తెలియాల్సి వుంది. ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యాజమాన్యాలు, తల్లిదండ్రుల సంఘాలతో త్వరలో సమావేశాలు నిర్వహించాలని అధికారులు ఆలోచిస్తున్నారు.
మరోవైపు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సెప్టెంబరు నెలాఖరులో ఫస్టియర్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. కరోనా తీవ్రత కారణంగా వారికి మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించకుండానే రెండో సంవత్సరానికి ప్రమోట్ చేశారు. ఒకవేళ రెండో సంవత్సరం పరీక్షలు కూడా నిర్వహించలేని పరిస్థితి వస్తే మార్కులు వేసేందుకు ప్రాతిపదిక ఉండదు కాబట్టి.. కచ్చితంగా మొదటి సంవత్సరం పరీక్షలు జరపాలని ఇంటర్ బోర్డు ప్రతిపాదించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com