ELECTIONS: స్థానిక ఎన్నికలకు అంతా సిద్ధం..?

ELECTIONS: స్థానిక ఎన్నికలకు అంతా సిద్ధం..?
X
ముసాయిదా ఓటర్ల జాబితా సిద్ధం.. తొలుత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకారం తెలంగాణలో మొత్తం ఓటర్లు 1.67 కోట్లు ఉండగా అందులో మహిళలు 85,28,573 మంది ఉన్నారు. ఇది మొత్తం ఓటర్లలో 51 శాతం కావడం విశేషం. హైదరాబాద్ జిల్లా మినహా మొత్తం 538 మండలాల్లోని 12,848 గ్రామ పంచాయతీలకు, 5,817 ఎంపీటీసీలకు, 570 ఎంపీపీ/జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రిటైర్డ్ ఐఏఎస్ బూసాని వెంకటేశ్వర్లు నేతృత్వంలోని సింగిల్ మ్యాన్ డెడికేటెడ్ కమిషన్ ఖరారు చేసే రిజర్వేషన్ ఫార్ములాకు అనుగుణంగా వార్డుల కేటాయింపుపై స్పష్టత రానుంది. ముసాయిదా జాబితా ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 1,67,33,584 మంది ఓటర్లు ఉండంగా అందులో మహిళలు 85,28,573 మంది ఉన్నారు.

తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు

తెలంగాణలో తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు హస్తం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. డెడికేటెడ్ కమిషన్ రిపోర్టును అధ్య యనం చేసిన తర్వాత దీనిపై స్పష్టంత రానుంది. ఎమ్మెల్యేలు, మండలస్థాయి కాంగ్రెస్ నేతలు మాత్రం పార్టీ గుర్తుపై జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల జరిగిన సీఎల్పీ సమావేశంలో సైతం ఇదే అభిప్రాయాన్ని వెలిబు చ్చారు. దీంతో తొలుత ఈ ఎన్నికలను నిర్వహించి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలను నిర్వహించే అవకాశముంది. అంటే తొలుత తెలంగాణలోని మొత్తం 5,817 ఎంపీటీసీలు, 570 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేలా జిల్లాలవారీ గా లెక్కలు రెడీ అయ్యాయి.

మహిళలపైనే ఆశలన్నీ

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతున్న వేళ.. కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఆశలన్నీ మహిళలపైనే పెట్టుకుంది. మహాలక్ష్మి పథకం సహా సంక్షేమ పథకాలు తమకు వరంగా మారుతాయని కాంగ్రెస్ పార్టీ గంపెడు ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే ఆర్టీసీ బస్సులో 135 కోట్ల జీరో టికెట్లు జారీ అయినట్లు ఆర్టీసీ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇవే తమకు ఓట్లు తెస్తాయని హస్తం పార్టీ భావిస్తోంది. రోజుకు సగటున 30 లక్షల జీరో టికెట్లు జారీ అవుతున్నాయని, దాదాపు రూ. 11 కోట్ల విలువకు సమానమని ఆర్టీసీ లెక్కలు తీసింది.

Tags

Next Story