మెడికల్ కాలేజీల్లో కొనసాగుతున్న ఈడీ సోదాలు

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పలు మెడికల్ కాలేజీల్లో ఈడీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ప్రైవేటు వైద్య కళాశాలల్లో పీజీ సీట్లు బ్లాక్ చేసి.. అధిక ధరలకు అమ్ముకున్న తీరుపై ఈడీ దృష్టి సారించించింది. హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని వైద్య కళాశాలల్లో రెండో రోజు ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని కామినేని వైద్య కళాశాలలో ఈడీ సోదాలు ముగిశాయని అధికారులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 9 ప్రైవేటు వైద్యకళాశాలలకు సంబంధించి 16 ప్రాంతాల్లో ఈడీ బృందాలు బుధవారం ఏకకాలంలో సోదాలు మొదలుపెట్టాయి. ఈడీ ఆఫీస్ నుంచి పలు వాహనాల్లో ఉదయమే బయలుదేరిన బృందాలు హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఖమ్మం, రంగారెడ్డి, నల్గొండ.. తదితర ప్రాంతాల్లోని వైద్య కళాశాలలతోపాటు.. ఆఫీసుల్లో.. ఇళ్లల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించాయి. CRPF, RAF బలగాలు ఈడీ బృందాలకు రక్షణ కల్పించాయి. కాలేజీల్లో కీలక వ్యక్తుల్ని బయటికి వెళ్లనీయకుండా ఆపిన ఈడీ బృందాలు.. ఉదయం నుంచి రాత్రివరకు సోదాలు కొనసాగించాయి.
రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు.. కొందరు మెరిట్ విద్యార్థులు, దళారులతో కుమ్మక్కై పీజీ సీట్ల బ్లాకింగ్ దందాకు పాల్పడ్డాయనేది ప్రధాన ఆరోపణ. ముందుగానే ఓ కాలేజీలో కన్వీనర్ కోటాలో పీజీ సీటు పొందిన విద్యార్థి.. మరో కాలేజీలోనూ చివరి విడత కౌన్సెలింగ్ వరకు సీటు బ్లాక్ చేయడమే ఈ దందాలో కీలకం. అలా చివరి వరకు ఆ సీటు బ్లాక్ అయి ఉండటంతో మిగిలిన విద్యార్థులు ఆ సీటు పొందే అవకాశం ఉండదు. అలా మిగిలిపోయే సీటును కాలేజీ నిర్వాహకులు సొంతంగా భర్తీ చేసుకునే వెలుసుబాటు ఉంటుంది. అలా పెద్దమొత్తంలో డబ్బు తీసుకొని సీట్లను విక్రయించారనేది కొన్ని ప్రైవేటు కాలేజీలపై కాళోజీ వర్సిటీ వర్గాలు మోపిన అభియోగం.
గత ఏడాది 45 సీట్లు పక్కదారి పట్టినట్లు వర్సిటీ వర్గాల అంతర్గత విచారణలో తేలింది. తమ సొంత రాష్ట్రాల్లో కన్వీనర్ కోటాలో సీటు వచ్చే అవకాశమున్న విద్యార్థులూ తెలంగాణలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో సీట్లను బ్లాక్ చేసినట్లు వెల్లడైంది. అందుకు ప్రవాస భారతీయ.. వైద్య సంస్థ కోటాను ఎంచుకున్నారు. దీంతో ఆ సీట్లను బ్లాక్ చేసిన విద్యార్థుల నుంచి కాళోజీ వర్సిటీ వివరణ కోరింది. అందులో ఏడుగురు విద్యార్థులు తాము అసలు దరఖాస్తే చేయలేదని వివరణ ఇవ్వడంతో వర్సిటీ వర్గాలు కంగుతిన్నాయి. పెద్దమొత్తంలో దందా జరిగిందని అనుమానించి వరంగల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగానే ఈడీ రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com