PHONE TAPPING CASE: టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావు అరెస్ట్

ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీగా రాధాకిషన్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ ఠాణాకు వచ్చిన ఆయన్ని వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం రాత్రి వరకు విచారించింది. అనంతరం అరెస్ట్ చేసింది. ఇవాళ ఆయన్ని న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును ప్రశ్నించిన సమయంలో బంజారాహిల్స్ ఠాణా గేట్లు మూసేసి గోప్యత పాటించారు. సస్పెండ్ అయిన DSP ప్రణీత్‌రావు ఫోన్‌ట్యాపింగ్ ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా... క్షేత్రస్థాయిలో రాధాకిషన్‌రావు బృందం అనధికారిక ఆపరేషన్లు చేపట్టిందనే ఆరోపణలున్నాయి. ప్రణీత్‌రావు వాంగ్మూలం ఆధారంగా ఇద్దరు అదనపు ఎస్పీలతోపాటు రాధాకిషన్‌రావు, విశ్రాంత ఐజీ ప్రభాకర్‌రావు, ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్‌రావు ఇళ్లలో కొద్దిరోజుల క్రితం సోదాలు నిర్వహించారు.
అనంతరం ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను అరెస్ట్ చేయగా మిగిలిన ముగ్గురు అజ్ఞాతంలోకి వెళ్లారు. వీరు ముగ్గురూ విదేశాలకు వెళ్లినట్లు భావించిన పోలీసులు లుక్‌అవుట్ నోటీస్‌లు జారీ చేశారు. అనూహ్యంగా రాధాకిషన్‌రావు నిన్న ఉదయం పోలీసుల ఎదుటికి వచ్చారు. బోయినపల్లిలోని తన ఇంటి నుంచి వచ్చి వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్‌ను కలిశారు. ఈ క్రమంలో ఫోన్‌ట్యాపింగ్ అంశంలో ప్రణీత్‌రావుకు రాధాకిషన్‌రావు ఇచ్చిన ఆదేశాలు.. ఆయన నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా.. క్షేత్రస్థాయిలో చేపట్టిన ఆపరేషన్ల గురించి పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఎవరి సూచనల మేరకు ఫోన్‌ట్యాపింగ్ చేయాలని ప్రణీత్‌రావుకు ఆదేశాలిచ్చారని రాధాకిషన్‌రావును ఆరా తీశారు. ఫోన్‌ట్యాపింగ్ సమాచారంతో క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ ఆపరేషన్లు చేపట్టారు..? హవాలా లావాదేవీల క్రమంలో నిర్వహించిన దాడుల్లో ఏం జరిగింది..? పలువురు వ్యాపారులను బెదిరించి అక్రమంగా డబ్బు సంపాదించారనే ఆరోపణల్లో వాస్తవమెంత? అనే అంశాలపై ఆధారాలు సేకరించినట్లు సమాచారం. మరోవైపు.. టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఐబీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన గట్టుమల్లును పోలీసులు.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు.
ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంపై ప్రశ్నించి.. వాంగ్మూలం నమోదు చేశారు. తననెందుకు అదుపులోకి తీసుకున్నారని ఎదురు ప్రశ్నించడంతో.. ఓ ఉన్నతాధికారి తనదైన శైలిలో విచారించినట్లు ప్రచారం జరిగింది. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్‌రావుతోపాటు ఆయన బృందంపై పలు ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వ పెద్దలు.. తాము లక్ష్యంగా చేసుకున్న ప్రత్యర్థులను దారికితెచ్చే బాధ్యతను టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించేవారని ప్రతిపక్షాలు బహిరంగంగానే ఆరోపించేవి. రాధాకిషన్‌రావుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పలుమార్లు ఆరోపణలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయి చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను ఐదు రోజుల పోలీస్ కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 2 వరకు కస్టడీ విధించింది. ప్రణీత్‌రావును పోలీస్ కస్టడీకి ఇచ్చేందుకు మాత్రం న్యాయస్థానం నిరాకరించింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com