TS: క్లిష్ట పరిస్థితులున్నా సంక్షేమాన్ని విస్మరించలేదు
తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా సంక్షేమాన్ని విస్మరించకుండా ఇప్పటివరకూ రూ.34,579 కోట్లను వివిధ పథకాలపై ఖర్చు చేశామని ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. గత పాలకులు అన్ని రంగాల్లో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రణాళికాబద్ధంగా నడపాల్సిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఒంటెత్తు పోకడలతో సొంత జాగీరులా నడిపారని తీవ్రంగా మండిపడ్డారు. గత ప్రభుత్వ తప్పిదాల పర్యవసానాన్ని మేం చవిచూస్తున్నామని... తమ సర్కారు ఏర్పడేనాటికే కుంటుపడ్డ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం పెనుసవాల్‌గా మారిందని భట్టి అన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం స్థాపిస్తామన్న వాగ్దానాన్ని నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలా కాకుండా రైతులకు ఒకేసారి రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేయాలని తమ ప్రభుత్వం సంకల్పించిందన్నారు. గత ప్రభుత్వం రైతుబంధు కింద వెచ్చించిన రూ.80,440 కోట్లలో అధిక శాతం అనర్హులకే దక్కాయన్నారు. అది క్షమించరాని నేరమని వెల్లడించారు. అర్హులకు మాత్రమే రైతుభరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో క్యాబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటుచేసి అభిప్రాయాలు సేకరించామని... త్వరలోనే విధివిధానాలపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. భూమిలేని రైతుకూలీలకు సంవత్సరానికి ఎకరాకు రూ.12 వేలు చెల్లించే బృహత్ కార్యాన్ని ఈ ఏడాదే ప్రారంభించబోతున్నామని భట్టి తెలిపారు. గత ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం చెల్లించక రైతు కడగండ్లకు కారణమైందన్నారు. ఈ ఏడాది నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరాలని నిర్ణయించామన్నారు.
పంటల బీమా మొత్తం ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని.... ప్రభుత్వం గుర్తించిన 33 రకాల వరి ధాన్యాలకు క్వింటాకు రూ.500 బోనస్ చెల్లించాలని నిర్ణయించామని భట్టీ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోళ్ల చెల్లింపులు సకాలంలో జరిగేవి కావన్నారు. తమ ప్రభుత్వం 48 గంటల్లోనే డబ్బు చెల్లిస్తుందన్నారు. ఇప్పటివరకు రూ.10,556 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేశామని... తాము వచ్చేనాటికి సుమారు 1000 మంది మిల్లర్లు ప్రభుత్వానికి రూ.3000 కోట్లు బకాయిపడ్డారని వెల్లడించారు. గత ఆరు నెలల్లోనే మిల్లర్ల నుంచి రూ.450 కోట్లు వసూలు చేశామని... కొత్త వ్యూహాలతో కేంద్రం నుంచి రూ.3561.64 కోట్లను సాధించుకోగలిగామని వెల్లడించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com