Sai Chand: ప్రజాగాయకుడు సాయి చంద్‌ హఠాన్మరణం

Sai Chand: ప్రజాగాయకుడు సాయి చంద్‌ హఠాన్మరణం
ప్రజా గాయకుడు, తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ మృతి చెందారు. నిన్న అర్ధరాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో కేర్‌ ఆసుపత్రికి తరలించారు

ప్రజా గాయకుడు, తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ మృతి చెందారు. నిన్న అర్ధరాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో కేర్‌ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతన్ని కాపాడాలని ఎంత ప్రయత్నించినా వారి ప్రయత్నం ఫలించలేదు. సాయి చంద్‌ హఠాన్మరణంతో ఆయన స్వగ్రామం వనపర్తి జిల్లా అమరచింతలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. సాయిచంద్ పాటలను, ధూంధాం, ఉద్యమ ఆకాంక్షలను గుర్తు చేసుకుంటూ గ్రామస్తులు కన్నీంటి పర్యంతమవుతున్నారు.

మరో వైపు సాయిచంద్ పార్ధీవదేహానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్ నివాసంలో అతని భౌతికకాయానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, నోముల భగత్, బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. సాయిచంద్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని, పాటలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సాయిచంద్ కుటుంబానికి అండగా ఉంటామని మంత్రులు తెలిపారు.

అటు వనపర్తి క్యాంపు కార్యాలయంలో సాయిచంద్ చిత్రపటానికి మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నివాళులర్పించారు. జిల్లాలోని ప్రధాన కూడలిలో బీఆర్ఎస్ నేతలు, ఉద్యమకారులు సాయిచంద్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. పేదలకు మేలు జరగాలని తపించే ఉద్యమ గళం హఠాన్మరణంతో తెలంగాణ మూగబోయిందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. పార్టీ, ప్రభుత్వ పరంగా సాయిచంద్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

కాసేపట్లో గుర్రంగూడకు సీఎం కేసీఆర్ రానున్నారు. సాయిచంద్ భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు సీఎం కేసీఆర్. సాయిచంద్ మృతితో షాక్‌కు గురయ్యానని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సాయిచంద్ గొప్ప కళాకారుడు, తెలంగాణ ప్రజల గొంతుక మూగబోవడం తీరని లోటని తెలిపారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలి దేవున్ని ప్రార్ధిస్తున్నానని కేటీఆర్‌ వెల్లడించారు. సాయిచంద్ మృతి పట్ల టీపీసీసీ ఛీప్‌ రేవంత్‌ రెడ్ది సంతాపం తెలిపారు. అలాగే గద్దర్, విమలక్క సాయిచంద్‌తో ఉన్న అనుబంధం గుర్తుచేసుకుంటూ అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story