TG: నేడే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ప్రభుత్వ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. హైదరాబాద్ వేదికగా ఇవాళ ఉదయం, సాయంత్రం ఉత్సవాలు జరగనున్నాయి. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు గన్ పార్కులో అమర వీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పిస్తారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరగనున్న వేడుకలకు హాజరై జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. పోలీసు బలగాల పరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమాలు ఉంటాయి. అదే వేదికపై "జయ జయహే తెలంగాణ" రాష్ట్ర అధికార గీతాన్ని జాతికి అంకితం చేస్తారు. అనంతరం సీఎం ప్రసంగించనున్నారు.ఈ సందర్భంగా పోలీసు సిబ్బందికి, ఉత్తమ శకటాలకు అవార్డులను ప్రదానం చేసి ఫోటో సెషన్ లో పాల్గొంటారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉన్న కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ ఆరోగ్య సమస్యల కారణంగా హాజరుకాకపోవచ్చని తెలుస్తోంది. రేపు సాయంత్రం ట్యాంక్ బండ్ పై జరిగే వేడుకల్లో జయజయహే తెలంగాణ గీత రచయిత అందెశ్రీ, స్వరకర్త కీరవాణిలను సత్కరిస్తారు. పరేడ్ మైదానంలో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు జూపల్లి, పొన్నం ప్రభాకర్ రాజకీయాలకు అతీతంగా వేడుకల్లో అంతా భాగస్వాములు కావాలనికోరారు.
జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఆదివారం ఉదయం 9గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో కలెక్టర్లు జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. అంతకుముందు అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులర్పించనున్నారు. శనివారం సాయంత్రమే కలెక్టర్, మున్సిపల్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను లైటింగ్‌తో అలకరించేందుకు ఆదేశాలిచ్చారు. రేపటి అవతరణ వేడుకల ఏర్పాట్లపై నల్లగొండ కలెక్టర్ హరిచందన శుక్రవారం సమీక్ష నిర్వహించి తగిన ఆదేశాలిచ్చారు.
ఉత్సవాల నేడు బీఆర్‌ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలకు కేసీఆర్ తెలంగాణ భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, బీఆర్‌ఎస్ జెండాను ఎగురవేస్తారు. 9.30కు తెలంగాణ భవన్ సమావేశ మందిరంలో ‘తెలంగాణ యాది’పేరిట ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను అమరుల కుటుంబాల చేతుల మీదుగా ప్రారంభిస్తారు. అనంతరం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో నాయకులు, కార్యకర్తలతో జరిగే సమావేశంలో కేసీఆర్ ప్రసంగిస్తారు. ఈ సమావేశానికి వచ్చే నాయకులు, కేడర్ కోసం మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఉత్సవాల చివరి రోజు 3వ తేదీన జిల్లా కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తారు. జిల్లా కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాలు మినీ తెలంగాణ భవన్లలో పార్టీ జిల్లా అధ్యక్షులు జాతీయ పతాకం, పార్టీ జెండాను ఎగురవేస్తారు. స్థానికంగా పండ్ల పంపిణీ, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com