Telangana: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు భారీ సన్నాహాలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జూన్ 2తో రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తవుతున్నందున.. ప్రత్యేక వాతావరణంలో ఉత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జయ జయహే తెలంగాణ గీతం, సవరించిన రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించనున్నారు. సోనియా గాంధీని... ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పలువురిని సత్కరించనున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి సారి జరగనున్న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ప్రత్యేక వాతావరణంలో జరిపేందుకు కసరత్తు జరుగుతోంది. జూన్ 2తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతుంది. దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర అధికారికాన్ని ఆవిష్కరించేందుకు జయ జయహే తెలంగాణకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరకల్పన చేస్తున్నారు. ఉద్యమం సమయంలో విస్తృత ప్రాచుర్యం పొంది.. స్ఫూర్తిని నింపిన జయ జయహే తెలంగాణ గేయాన్ని నిడివిని సుమారు రెండు నిమిషాలకు కుదించడంతో పాటు.. కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సవరించిన అధికార చిహ్నం, తెలంగాణ తల్లి రూపాన్ని కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్న అధికార చిహ్నాన్ని, తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాలని ఇప్పటికే కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. రాచరికపు పోకడలు లేని చిహ్నం, గ్రామీణ సాధారణ మహిళను ప్రతిబింబించేలా తెలంగాణ విగ్రహం ఉంటుందని గతంలో పలు సందర్భాల్లో మంత్రులు ప్రస్తావించారు. కొత్త చిహ్నం, తెలంగాణ తల్లి రూపాన్ని జూన్ 2న ఆవిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా సోనియా గాంధీని సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రావిర్భావంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఉద్యమకారులకు సన్మానం చేయనున్నారు. తుక్కుగూడలో భారీ సభ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సన్మానం చేయాల్సిన ఉద్యమ కారుల జాబితా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ కొనసాగుతున్నందున... అనుమతి కోసం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు త్వరలో లేఖ రాయనున్నారు. జూన్ 1నే దేశవ్యాప్తంగా పోలింగ్ ముగియనున్నందున... ఈసీ అనుమతి ఇస్తుందని ప్రభుత్వం నమ్మకంతో ఉంది. ఆరుగ్యారంటీల్లో మరొకటి లేదా మరేదైనా కొత్త పథకం లేదా పాలసీని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన ప్రకటించాలని ఆలోచిస్తున్నప్పటికీ.. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. టీఎస్ ను టీజీగా మార్చిన ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖలకు చెందిన బోర్డులు, వెబ్ సైట్ లన్నీ పూర్తిగా మారుస్తోంది. జిల్లా, మండల కేంద్రాలు, పంచాయతీల్లోనూ అవతరణ దినోత్సవాలు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com