TG: వీధి కుక్కల దాడిలో పిల్లలు చనిపోతుండడంపై హైకోర్టు ఆందోళన

TG: వీధి కుక్కల దాడిలో పిల్లలు చనిపోతుండడంపై హైకోర్టు ఆందోళన
X
ప్రభుత్వానికి ఓ విధానం లేదా అని సూటి ప్రశ్న... భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం

వీధి కుక్కల దాడుల్లో చిన్నపిల్లలు చనిపోతున్న ఘటనలపై తెలంగాణ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వరుసగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వానికి ఓ విధానం అంటూ లేకపోవడం ఏమిటని ఘాటుగా ప్రశ్నించింది. కేవలం పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటామంటే కుదరదని, ఇలాంటివి భవిష్యత్తులో చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నిర్దేశించింది. గతేడాది ఫిబ్రవరి 19న అంబర్‌పేట్‌లో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్‌, తాజాగా జూన్‌ 28న పటాన్‌చెరులో బీహార్‌ వలసకూలీల కుటుంబానికి చెందిన ఆరేళ్ల బాలుడు విశాల్‌ కుక్కల దాడిలో చనిపోయిన ఘటనలపై వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ ధర్మాసనం ఈ పిటిషన్‌లపై మరోసారి విచారణ చేపట్టింది. ఇదే అంశానికి సంబంధించి ‘అనుపమ్‌ త్రిపాఠీ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలను ఎంతవరకు అమలు చేస్తున్నారో వివరించాలని తెలంగామ ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ, పోలీసుశాఖ, ఇతరులకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ ఈనెల 10కి వాయిదాపడింది.


ఇటీవల బాలుడి మృతి

ఆరేళ్ల బాలుడిని వీధి కుక్కలు చుట్టుముట్టి కరవడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ఘటన ఇటీవల సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఠాణా పరిధిలో జరిగింది. బిహార్‌కు చెందిన బాల్కన్‌ తన భార్య ప్రమీల, ముగ్గురు పిల్లలతో కలిసి నెల క్రితం పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌కు వచ్చి.. మహీధర వెంచర్‌ సమీపంలో మేస్త్రీ దగ్గర కూలీగా పని చేస్తూ స్థానికంగా గుడిసెలో నివసిస్తున్నారు. గత శుక్రవారం ఉదయం అతని చిన్న కుమారుడు ఆరేళ్ల బిశాల్‌ ఇంటి సమీపంలో బహిర్భూమికి వెళ్లగా మూడు కుక్కలు ఒకేసారి అతనిపై దాడి చేశాయి. మెడ ఇతర శరీర భాగాలపై తీవ్రంగా కరిచాయి. చుట్టుపక్కల వారు గమనించి వెళ్లే సరికి బాలుడు అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు.

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన భార్యాభర్తలు గోకిరాం, రోత్న ముత్తంగి గ్రామం నాగార్జునకాలనీలో కూలి పనులు చేసుకుంటూ నివసిస్తున్నారు. వారి 7 నెలల కుమార్తె స్వాతి ఇంట్లో పడుకుని ఉండగా.. ఓ వీధి కుక్క వచ్చి ఆమె కంటిపై కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారిని వెంటనే ఆసుపత్రికి, అనంతరం నిలోఫర్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags

Next Story