Gaddar Awards: గద్దర్ అవార్డుల కోసం రూ.10 కోట్లు?

తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డుల కోసం రూ. 10 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించినట్లు సమాచారం. వచ్చే ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ కోసం అన్ని శాఖలతో డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఫిల్మ్ డెవల్‌పమెంట్‌కు కేటాయించే మొత్తం నిధుల్లో నుంచి గద్దర్ అవార్డుల కోసం రూ.10 కోట్లను ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖంగా నిలిచిన నంది అవార్డులను ఇకపై గద్దర్ పేరిట అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతేడాది ప్రకటించారు. ప్రజా గాయకుడిగా, ప్రజల కోసం పాటలు పాడిన గద్దర్ స్ఫూర్తిని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆయన పాటలు సామాజిక స్పృహ పెంచేలా, ప్రజా సమస్యలను ప్రతిబింబించేలా ఉండేవి. అందుకే గద్దర్ పేరుతో అవార్డులు అందజేయడం గౌరవప్రదమైన విషయమని ప్రభుత్వం భావిస్తోంది.
బడ్డెట్ రూపకల్పనలో ప్రాధాన్యం
తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పనలో భాగంగా కళా, సాంస్కృతిక రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. సినీ అభివృద్ధి సంస్థలతో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాల కోసం కూడా నిధులను కేటాయించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. గద్దర్ పేరిట అవార్డులు ఇస్తే, ప్రజా కళాకారులను ప్రోత్సహించడంతో పాటు సామాజిక స్పృహ కలిగిన చిత్రాలను ప్రోత్సహించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఉగాదికి గద్దర్ అవార్డులు : భట్టి
ఉగాదికి గద్దర్ అవార్డులు ఇవ్వనున్నట్లు ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ మావల్లనే వచ్చిందని చెప్పుకునే వాళ్ళ కంటే గద్దర్ తోటే తెలంగాణ ఉద్యమ వ్యాప్తి అయ్యింది. అలాంటి వ్యక్తిని ప్రగతి భవన్ ముందు గంటల తరబడి కూర్చోబెట్టడం ఎంతవరకు న్యాయం. అయితే గత ప్రభుత్వం గద్దర్కి గౌరవం ఇవ్వకపోయినా.. గద్దర్ గౌరవాన్ని ఈ ప్రభుత్వం ఆకాశమంత ఎత్తుకి నిలబెడుతోంది అని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com