WATER: పాలమూరు ఎత్తిపోతలకు మొదటి దశ అనుమతులు ఇవ్వాలి

WATER: పాలమూరు ఎత్తిపోతలకు మొదటి దశ అనుమతులు ఇవ్వాలి
కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి.... 45 టీఎంసీలకైనా ఇవ్వాలని విజ్ఞప్తి

ట్రైబ్యునల్ తీర్పుతో సంబంధం లేకుండా పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలకు మొదటి దశ అనుమతులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. మొత్తం 90 TMCలు కాకపోయినా చిన్ననీటి వనరుల మిగులుకు చెందిన 45 TMCలకు అయినా అనుమతులు ఇవ్వాలని అంటోంది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ, తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కోసం ప్రయత్నం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందులో భాగంగా కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్‌ను CM రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి వినతిపత్రం అందించారు. ప్రస్తుతం ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వడం లేదని, ప్రధానమంత్రి క్రిషి సించాయ్ యోజన కింద పాలమూరు - రంగారెడ్డికి కేంద్రం నుంచి సాయం చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.


అయితే... ప్రాజెక్టుకు ఇంకా అవసరమైన అన్ని అనుమతులు రాలేదు. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితాలో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ఉంది. అనుమతుల కోసం ప్రాజెక్టు DPRను కేంద్ర జలసంఘానికి పంపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 811 TMCల కృష్ణా జలాలను తెలంగాణ, APకి పంపిణీ చేసే అంశాన్ని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌కు కేంద్ర ప్రభుత్వం నివేదించింది. 90 TMCల నీటిని వినియోగించుకునేందుకు పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును తెలంగాణ చేపట్టింది. తెలంగాణ వాటాలో ఉన్న చిన్ననీటి వనరుల్లో మిగులు 45 TMCలు... పట్టిసీమ, పోలవరం నుంచి గోదావరి నీటిని కృష్ణాకు తరలిస్తున్నందున ఎగువన రావాల్సిన 45 TMCలను ఇందుకోసం ప్రతిపాదించారు. DPRలో ఆ మేరకు పొందుపరిచారు.

కృష్ణా జలాల అంశం ట్రైబ్యునల్ పరిధిలో ఉన్నందున... తీర్పు వచ్చే వరకు పాలమూరు - రంగారెడ్డి DPRర్ ను పరిశీలించలేమని కేంద్ర జలసంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం కూడా ఇచ్చింది. ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు వేచి చూస్తే నష్టం జరుగుతుందన్న భావనతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆలోచన చేసింది. APతో సంబంధం లేని 45 TMCలతో మొదటి దశ అనుమతులు ఇవ్వాలని కోరుతోంది. తాగునీటి అవసరాల కోసం వినియోగించుకుంటామని చెబుతోంది. అలా అయితే ట్రైబ్యునల్ తీర్పు వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని అంటోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ లేఖ కూడా రాసింది. ఈ విషయంలో కొంత సానుకూలత కూడా ఉందని అంటున్నారు. 45 TMCలతో మొదటి దశ అనుమతులు తెచ్చుకొని ఆ తర్వాత మిగిలిన 45 TMCలతో పూర్తిస్థాయి అనుమతులు పొందవచ్చని చెప్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story