TPCC: తెలంగాణకు తీరని ద్రోహం చేసిన కేంద్ర బడ్జెట్

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2025లో.. తెలంగాణ మాటే వినిపించకపోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్ర బడ్జెట్ తెలంగాణ హక్కులను, ఆకాంక్షలను కాలరాసిందని రేవంత్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించింది. కేంద్ర బడ్జెట్ చాలా నిరాశకు గురి చేసిందని.. మొత్తం బడ్జెట్ ప్రసంగంలో అసలు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ అన్న పదమే పలకలేదని బీజేపీ మినహా మిగిలిన పార్టీలు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన అభ్యర్థనలను అస్సలు కేంద్రం పట్టించుకోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర వార్షిక బడ్జెట్-2025పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమైన సీఎం.. కేంద్ర బడ్జెట్ పై సుదీర్ఘంగా చర్చించారు. బడ్జెట్ పై ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు జరిపారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండిచేయి చూపడంపై రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై ఎలా స్పందించాలనే దానిపైనా సమీక్షలో రేవంత్ చర్చించారు.
తెలంగాణను పట్టించుకోలే..
తెలంగాణ సమస్యలు, అభివృద్ధి అంశాలను పట్టించుకోలేదని విమర్శించింది. స్థూల దేశీయోత్పత్తికి 5 శాతం వాటాను అందిస్తున్న తెలంగాణను.. ప్రధాని మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించింది. తెలంగాణ నుంచి రూ.26 వేల కోట్ల పన్ను ఆదాయం కేంద్రానికి వెళ్లిందని, 8 మంది బీజేపీ ఎంపీలను తెలంగాణ గెలిపించి పంపించిందని గుర్తుచేసింది. అయినా.. తెలంగాణకు ప్రధాని మోదీ ద్రోహం చేశారని విమర్శించింది. ఈ బడ్జెట్‌లో కేంద్ర సెస్‌లను మరింత పెంచుకుందని, దానివల్ల రాష్ట్రాల పన్నుల వాటాలు తగ్గే ప్రమాదముందని ఆందోళన వ్యక్తంచేసింది. కేంద్ర సౌజన్య పథకాలపై రాష్ట్రాలు ఆధారపడేలా నిధులు పెంచిందని, సీఎ్‌సఎ్‌సలను రాష్ట్రాలు వర్తింపజేసుకోవాలా? లేదా? అన్న స్వయం నిర్ణయాధికారాన్ని విస్మరించిందని విమర్శించింది.
బడ్జెట్ పై టీపీసీసీ చీఫ్ తీవ్ర విమర్శలు
కేంద్ర బడ్జెట్ పై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణకు గాడిద గుడ్డు లాంటి బడ్జెట్ ఇచ్చిందని మండిపడ్డారు. తెలంగాణ నుంచి కోట్ల రూపాయలు పన్నుల రూపంలో కేంద్రానికి పోతున్నాయని, కానీ కేంద్రం నుంచి నిధులు మాత్రం రావడం లేదని మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. సబ్ కా వికాస్ అనే గొప్ప మాటలు చెప్పే మోదీ.. పక్షపాతంగా వ్యవహరించారని ఫైర్ అయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com