TG: రైతు భరోసా పథకం అమలుపై మంత్రివర్గ ఉప సంఘం

TG: రైతు భరోసా పథకం అమలుపై మంత్రివర్గ ఉప సంఘం
X
చైర్మన్‌గా భట్టి విక్రమార్క.. సభ్యులుగా మంత్రులు... విధి విధానాలు... మార్గదర్శకాలపై అధ్యయనం...

రైతుభరోసా పథకం అమలుకు అనుసరించాల్సిన విధివిధానాలు, మార్గదర్శకాలపై అధ్యయనం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉప సంఘానికి ఛైర్మన్‌గా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సభ్యులుగా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్లను ఇటీవల మంత్రివర్గ సమావేశంలోనే ప్రకటించారు. అయితే ఈ ఉపసంఘం ఏర్పాటుపై 11 రోజుల తర్వాత సీఎస్‌ శాంతికుమారి జీవో జారీ చేశారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీ.. రైతుభరోసా పథకం మార్గదర్శకాలపై అధ్యయనం చేయనుంది. ఈ కమిటీకి తెలంగాణ వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ రైతుభరోసాపై చర్చించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈనెల 15 నాటికి నివేదిక ఇవ్వాలని మంత్రివర్గ ఉప సంఘానికి క్యాబినెట్‌ భేటీలోనే సూచించారు. రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, రహదారులు, సాగుకు యోగ్యంలేని భూములకు రైతుభరోసా ఇవ్వకూడదని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పీఏసీఎస్‌ల్లో భేటీలు నిర్వహించి రైతుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలో రైతుసంఘాల నేతలు, ఇతరవర్గాల అభిప్రాయాలు తీసుకొని మార్గదర్శకాలు రూపొందించే బాధ్యతలు ఉపసంఘానికి అప్పగించారు.


బీఆర్‌ఎస్‌ వైఫల్యం వల్లే..

గత బీఆర్ఎస్‌ ప్రభుత్వం సాగులో లేని భూములకు కూడా రైతుబంధు వర్తింపజేసి 12 విడతల్లో దాదాపు రూ.25,670 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసిందని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల ఆరోపించారు. రైతుబంధు తరహాలో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా.. రైతుభరోసాకు పటిష్ఠ విధానాలను తమ ప్రభుత్వం రూపొందిస్తోందని తెలిపారు. ఆలస్యమైనా.. అర్హులకు మాత్రమే అందేలా రూపకల్పన చేస్తామని వివరించారు.

సాగు చేసేవారికి, సాగులో ఉన్న భూములకే రైతుభరోసా అందించాలని... స్థిరాస్తి భూములను మినహాయించాలని రైతులు ఇటీవల ప్రభుత్వాన్ని కోరారు. గరిష్ఠ పరిమితి విధించాలని... వానాకాలం సీజన్‌లోనే సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. పదెకరాలు ఉన్నవారికీ సాయం అందించాలని.. అలాంటివారిలో ఎక్కువ మంది ఆదర్శ రైతులున్నారని కొందరు తెలిపారు. ఆదాయపు పన్ను చెల్లించేవారికి చెల్లించవద్దని కొందరు కోరగా... ట్రాక్టర్ల రుణాలకు ఐటీ రిటర్నులు తప్పనిసరి చేసిన నేపథ్యంలో వారికీ ‘రైతుభరోసా’ వర్తింపజేయాలని మరికొందరు అన్నారు.

Tags

Next Story