TS: తెలంగాణ పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పులు

తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. సర్కార్ తాజాగా ఏఐ ద్వారా పాఠశాల విద్యను డిజిటల్ మోడ్‌లోకి మార్చాలని కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇంప్రూవ్ చేయడంలో ఏఐ వినియోగించాలని నిర్ణయించింది. సాంకేతిక వినియోగంపై టీచర్లకు శిక్షణను సైతం ఇప్పించేలా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా బెంగళూరులోని ఏక్ స్టెప్ ఫౌండేషన్‌ను తాజాగా తెలంగాణ విద్యాశాఖ అధికారులు సందర్శించారు.. ఈ ప్రతినిధి బృందంలో రాష్ట్ర ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ కమీషనర్ కృష్ణ ఆదిత్య, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహా రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్లు ఉమా హారతి, గరిమ తదితరులున్నారు. విద్యా రంగంలో డిజిటల్ పద్దతులను ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులలో విద్యా పరమైన నాణ్యతా ప్రమాణాలను పెంపొందించడంలో ఎక్ స్టెప్- ఫౌండేషన్ అగ్రగామిగా ఉంది. కాగా తొలిదశలో 3,673 పాఠశాలల్లోని 7,346 తరగతుల్లో తక్షణమే డిజిటల్ స్క్రీన్ ద్వారా బోధన జరిగేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నందన్ నీలేకని కో ఫౌండర్
ఎక్ స్టెప్- ఫౌండేషన్ – విజనరీ టెక్నోక్రాట్, ఫిలాంత్రపిస్ట్, ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ అయినా నందన్ నీలేకని ఈ ఎక్ స్టెప్-ఫౌండేషన్ కు కో-ఫౌండర్ గానూ ఉన్నారు. విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాల్లో డిజిటల్ పద్దతులను ప్రవేశపెట్టి మరింత మెరుగైన సేవలను అందించడానికి ఈ ఎక్ స్టెప్- ఫౌండేషన్ ప్రారంభించారు. ఈ ఫౌండేషన్ ఇప్పటికే గుజరాత్, కర్ణాటక, ఒడిస్సా, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి పనిచేస్తోంది.
సమగ్ర ప్రణాళిక
ఎక్ స్టెప్ -ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఈ ఏ.ఐ ఆధారిత విద్యను ప్రవేశ పెట్టడానికి తెలంగాణ సమగ్ర ప్రణాళికను రూపొందిస్తోంది. డిజిటల్ ఇనిషియేటివ్స్, ప్రాథమిక స్థాయిలో అభ్యసన నైపుణ్యాల పెంపు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు స్నేహపూర్వక అభ్యసన పద్ధతుల్లో సహాయం అందించడం రంగాల్లో ఈ ప్రణాళిక ను రూపొందిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com