TG: మారనున్న వరంగల్‌ రూపురేఖలు

TG: మారనున్న వరంగల్‌ రూపురేఖలు
X
‘కుడా’ బృహత్‌ ప్రణాళికకు ఆమోదం.. మామునూరు విమానాశ్రయ భూసేకరణ కోసం రూ.205 కోట్ల విడుదల..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఇప్పటికే కోటి జనాభా దాటింది. నగరం వేగంగా విస్తరిస్తుండటంతో పాటుగా జనాభా పెరుగుదలో గణనీయమైన వృద్ధిని సాధించింది. తెలంగాణకు రెండో రాజధాని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఎప్పట్నుంచో నానుతోంది. రెండో రాజధాని ప్రస్తావన వచ్చినప్పుడల్లా వరంగల్ నగరం తెరపైకి వస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరంగా వరంగల్ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రెండో రాజధానిగా వరంగల్ నగరాన్ని ఏర్పాటు చేసేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్‌కు సంబంధించి ప్రభుత్వ పరంగా రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇందులో కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా)- 2041 మాస్టర్‌ప్లాన్‌కు ఆమోదం లభించింది. మామునూరు విమానాశ్రయానికి అవసరమైన అదనపు భూ సేకరణకు రూ.205 కోట్లు విడుదల చేస్తూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. బృహత్‌ ప్రణాళికకు సంబంధించి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌ జీవో జారీ చేశారు. దీనిపై నేడు సోమవారం గెజిట్‌ ప్రచురించనుంది.

మాస్టర్ ప్లాన్ ఇలా..

వరంగల్, కాజీపేట, హనుమకొండ, అలాగే ఈ మూడింటి సమీపాన ఉన్న 181 రెవెన్యూ గ్రామాలలో కలిపి మొత్తం 1,805 చదరపు కిలోమీటర్లు ఈ మాస్టర్‌ప్లాన్‌ పరిధిగా నిర్ణయించారు. ఇందులో భాగంగా భూ వినియోగ జోన్లను గుర్తించారు. దీంతో ‘కుడా’ పరిధిలో భవన నిర్మాణాలకు అడ్డంకులు తొలగనున్నాయి. ప్రాంతీయ, బాహ్యవలయ, అంతర్‌ వలయ, అనుసంధాన రోడ్ల నిర్మాణాలు వేగంగా జరిగేందుకు అవకాశం ఏర్పడింది. చెరువులు, నాలాల పునరుద్ధరణ పనులు వేగవంతం కానున్నాయి. భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది.

2018లోనే మాస్టర్ ప్లాన్

వాస్తవానికి డ్రాఫ్ట్‌ మాస్టర్‌ప్లాన్‌ గుర్తింపునకు తొలుత 2018లోనే నోటిఫికేషన్‌ జారీచేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, కుడా ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్, ఇతర అధికారులు సమీక్షలు నిర్వహించిన అనంతరం ప్రతిపాదనలు రూపొందించి 2020లో ప్రభుత్వ ఆమోదానికి పంపారు. అయితే అప్పటి ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల కారణంగా అవాంతరాలు ఎదురయ్యాయి. వాటిని అధిగమించేందుకు పలు విడతలుగా సమావేశాలు నిర్వహించినా ఫలితం లేకపోయింది. వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి చేపట్టనున్న పనులలో మరో ముందడుగు పడింది. విమానాశ్రయానికి అదనంగా అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ.205 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

Tags

Next Story