TG: బెట్టింగ్ యాప్స్‌పై సిట్

తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు కొన్ని రోజులుగా కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్స్‌పై సిట్ ఏర్పాటు చేయనున్నట్టు అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటించారు. బెట్టింగ్ యాప్‌లు నిర్వహించినా, ఆడినా, ఆడించినా ప్రమోట్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి కేసుల్లో పడే శిక్షలను కూడా సవరించాల్సిన అవసరం ఉందన్నారు. గుట్కా వంటి నిషేధిత పదార్థాల సరఫరా పెరిగిందని తెలుస్తోందని... ఆన్‌లైన్ బెట్టింగ్, రమ్మీ ప్రచారం కల్పించినవారిని విచారించామని రేవంత్ వెల్లడించారు. ప్రచారం కల్పించినవారిని విచారించడంతోనే ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లు కాదన్న ముఖ్యమంత్రి... సిట్ ఏర్పాటు చేసి వీటికి అడ్డకట్ట వేయాలని నిర్ణయించామని తెలిపారు. ఆన్‌లైన్ బెట్టింగ్, నేరాల్లో ఏ రకంగా భాగస్వామ్యం ఉన్నా చర్యలు తప్పవని రేవంత్ హెచ్చరించారు. మరోవైపు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటే ప్రయోజనం లేదని గ్రహించిన ప్రభుత్వం మూలాలపై ఫోకస్ పెట్టింది.
బెట్టింగ్ యాప్ కేసులో మరోసారి నోటీసులు..!
బెట్టింగ్ యాప్ కేసులో పోలీసులు విచారణను మరింత ముమ్మరం చేశారు. ఈకేసులో ఇప్పటికే ఐదుగురిని విచారించిన పోలీసులు.. మిగతా వారిని కూడా విచారించడానికి సిద్ధమయ్యారు. పరారీలో ఉన్న వారికి మరోమారు నోటీసులు ఇవ్వనున్నారు. యాంకర్ శ్యామల సహా మిగిలిన వారిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్లు పోలీసులకు అందుబాటులోకి రాలేదు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com