TG: శాసనసభ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం!

తెలంగాణ ప్రభుత్వం వర్షాకాల శాసనసభ సమావేశాలకు సిద్దమవుతోంది. వివిధ శాఖలతో వరుస సమీక్షల నిర్వహణకు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు సమాయత్తమవుతున్నారు. అందుకు అనుగుణంగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు అధికారులు సన్నహాలు చేస్తున్నారు. అదేవిధంగా విద్య, వ్యవసాయ కమిషన్‌లతోపాటు రైతు భరోసా, రైతు రుణమాఫీ, ధరణి, ROR చట్టాలు తదితర అంశాలు.. అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక.. ఈ ఏడాది ఫిబ్రవరిలో సమావేశమైన శాసనసభ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఈ ఆర్థిక ఏడాది మొదటి నాలుగు నెలలకు సంబంధించి ప్రవేశ పెట్టిన బడ్జెట్ జూలై వరకు అమలులో ఉంటుంది.
ఆగస్టు నుంచి తదుపరి మార్చి వరకు అవసరమైన నిధుల కేటాయింపు కోసం పూర్తిస్థాయి బడ్జెట్‌కు రూపకల్పన చేయాల్సి ఉంది. ఈ నెలలో పార్లమెంటు సమావేశాలు నిర్వహించి NDA సర్కార్.. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర పద్దులో రాష్ట్రానికి కేటాయింపులు ఏ మేరకు ఉంటాయో చూసుకుని.. వాటి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దనుంది. రాష్ట్రంలో ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, రానున్న రోజుల్లో.. అమలు చేయనున్న కార్యక్రమాల అమలకు నిధులు కేటాయింపు తదితర అంశాలపై చర్చ జరగనుంది.
రైతు రుణమాఫీకి నిధుల సమీకరణ ఏ విధంగా చేయాలన్న దానిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. రైతుబంధు ప్రక్షాళన చేసి అనర్హులను గుర్తించే దిశగా సర్కార్ కసరత్తు చేస్తోంది. రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేలు ఇచ్చేందుకూ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ధరణి పోర్టల్ స్థానంలో ఆధునిక సాంకేతికతో కూడిన వ్యవస్థను భూభారతి పేరుతో తీసుకొస్తామని చెబుతూ వస్తోన్న ప్రభుత్వం ఇదే అంశంపై అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. కౌలు రైతులకుసైతం పంట పెట్టుబడి సాయం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. అందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటి పారుదల రంగాల్లో పారదర్శకత, జవాబుదారితనం కోసం విద్యా, రైతు కమిషన్‌లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు, చిహ్నం మార్పుపైనా చర్చ జరిగే అవకాశముంది. వర్షాకాల సమావేశాలల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌కు ఆమోదముద్ర సహా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com