WARANGAL: వరంగల్‌కు నిధుల వరద

తెలంగాణ ప్రభుత్వం.. వరంగల్ కు నిధుల వరద పారిస్తోంది. హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్ అభివృద్ధిపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. వరంగల్ నగరంలో వివిధ అభివృద్ధి పనుల కోసం గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.4962.47 కోట్లు మంజూరు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని పనులకు పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవ సభలు నిర్వహిస్తోంది. 20 రోజులపాటు నిర్వహించనున్న ఈ సభల ద్వారా ఏడాది కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తున్న తీరు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ప్రగతిని వివరించనుంది. ఈ విజయోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సెంటిమెంట్ ప్రకారం వరంగల్ ఆర్ట్స్ కాలేజీ మైదానాన్ని తొలి వేదికగా ఎంచుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రైతు డిక్లరేషన్ సభ నిర్వహించిన హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలోనే నేడు ప్రజాపాలన విజయోత్సవ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో.. వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ వివరాలను నేడు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించనున్నారు.
2050 విజన్ తో మాస్టర్ ప్లాన్
2050 విజన్ తో మాస్టర్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ ప్రతి 20ఏళ్లకు ఒకసారి అవసరాలకు తగ్గట్టుగా తయారు చేయవలసి ఉండగా గత 52ఏళ్లుగా మాస్టర్ ప్లాన్ మార్పుకు నోచుకోలేదు. అయితే వరంగల్ నగర రూపురేఖల్లో ఎన్నో మార్పులు రాగా, పదేళ్ళ క్రితం 2041 విజన్ తో ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 2050 విజన్ తో మాస్టర్ ప్లాన్ ను రూపొందించారు. ఈ మాస్టర్ ప్లాన్ కు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.
వరంగల్ అభివృద్ధికి పెద్దపీట
వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్లో అత్యధికంగా వరంగల్ భూగర్భ డ్రైనేజీకి రూ.4,170 కోట్లు కేటాయించింది. దీంతో వరంగల్ నగర ప్రజల 30 ఏళ్ల కలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సాకారం చే యనుంది. తొలి విడతలో రూ.3,087 కోట్లు, రెండో విడతలో రూ.597కోట్లు, మూడో విడతలో రూ.486 కోట్లు విడుదల చేస్తారు. ఈ మేరకు పనులను మూడు విడతల్లో పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం జీవోలో వెల్లడించింది. దీంతోపాటు మామునూరు ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి భూసేకరణకూ నిధులు మంజూరు చేసింది. మొత్తం 949 ఎకరాల్లో విమానాశ్రయాన్ని అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 669 ఎకరాలు ఉండగా.. అదనంగా మరో 280 ఎకరాలను సేకరించనుంది. ఇందుకోసం రూ.205 కోట్లు కేటాయించింది.
నేడే సీఎం పర్యటన
వరంగల్ పర్యటనలోభాగంగా సీఎం రేవంత్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు హయగ్రీవచారి గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకోనున్నారు. 3గంటలకు ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరిట రూ.92 కోట్ల వ్యయంతో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తారు. కవులు, కళాకారులతో ముచ్చటిస్తారు. మధ్యాహ్నం 3.10 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి మ.3.20కి ఆర్ట్స్ కాలేజీకి చేరుకుంటారు. మధ్యాహ్నం 3.50 గంటల వరకు ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి స్టాళ్లను పరిశీలించి, ఎస్‌హెచ్‌జీ, ఎంఎస్, జడ్‌ఎస్ మహిళా గ్రూపు సభ్యులతో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 3.55 గంటలకు విజయోత్సవ సభ వేదికపైకి చేరుకుంటారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నిర్మించనున్న 22 మహిళా శక్తి భవనాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో పది జిల్లాలో ఇప్పటికే ఈ భవనాలు ఉండగా, మిగిలిన జిల్లాల్లో కొత్తగా నిర్మించనున్నారు. ఎంజీఎంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌నూ ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభిస్తారు. మహిళలకు బ్యాంకు లింకేజీ చెక్కులను పంపిణీ చేస్తారు., అనంతరం విజయోత్సవ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 5గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com