TG: తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రుణాల మాఫీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 9వ తేదీని రుణమాఫీ కటాఫ్ తేదీగా ఏకగ్రీవ తీర్మానం చేసింది. రుణాలన్నింటినీ ఏకకాలంలో మాఫీ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. డిసెంబర్ 9, 2023 ముందు నాటికి తీసుకున్న రుణాలన్నింటినీ ఒకే విడతలో మాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 47 లక్షలకు పైగా మంది రైతులకు ఊరట లభించనుంది. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో విడతల వారీగా రెండుసార్లు రుణమాఫీ కోసం రూ.28 వేల కోట్లు ఖర్చు చేయగా.. కాంగ్రెస్ సర్కారు ఏకధాటిగా రుణమాఫీ చేసేందుకు రూ.31 వేల కోట్లు ఖర్చు చేయనుంది. పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు.. రుణమాఫీ అమలును మంత్రిమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. రైతులందరికీ గడువులోగా ఏక కాలంలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9 వరకు ఐదేళ్ల కాలంలో రైతులు తీసుకున్న రూ.2 లక్షల లోపు రుణాలన్నీ మాఫీ చేయనున్నట్లు తెలిపారు. గతంలోనే ప్రకటించినట్లుగా ఆగస్టు 15వ తేదీ లోగానే రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని స్పష్టం చేశారు.
సచివాలయంలో శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రైతు రుణమాఫీ, రైతుభరోసాపై మంత్రిమండలి సమావేశం జరిగింది. రుణమాఫీ విధివిధానాలను పూర్తిస్థాయిలో చర్చించిన తరువాత మంత్రివర్గం ఆమోదించింది. ఎన్నికల హామీలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో రుణామాఫీలు చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉండటం కారణంగా ఆలస్యమైంది. ఇప్పుడు ఎన్నికల కోడ్ లేకపోవడంతో రుణాల మాఫీపై స్పీడ్ పెంచింది సర్కార్. ప్రధానంగా ఆగస్ట్ 15 లోపు రైతు రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రకటన మేరకు.. ప్రభుత్వం స్పీడ్ పెంచింది.
రుణమాఫీపై రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. తన జీవితంలో ఈ రోజు చరిత్రాత్మకమని అన్నారు. 2022 మే 6న వరంగల్ వేదికగా లక్షలాది మంది తెలంగాణ రైతులకు రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ.. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ. నా సారథ్యంలో మంత్రివర్గం ఆ మాటను నిలబెట్టుకుంది. ఏకకాలంలో రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంది’ అని ఆయన పేర్కొన్నారు.
గత ప్రభుత్వం రెండుసార్లు రుణమాఫీ చేసింది. తొలిసారి 2014 మార్చి 31ని కటాఫ్‌గా తీసుకుని రూ.16 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసింది. రెండోసారి 2018 డిసెంబరు 11ని కటాఫ్‌గా తీసుకుని రైతుల ఖాతాల్లో వేసిన నిధులు రూ.12 వేల కోట్లు. గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రెండుసార్లు రుణమాఫీ కోసం చెల్లించిన నిధులు రూ.28 వేల కోట్లు. గత ప్రభుత్వం 2018 డిసెంబరు 11 కటాఫ్‌గా తీసుకుంటే.. మా సర్కారు 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9 వరకు కటాఫ్‌గా తీసుకుంది. ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో రైతులు తీసుకున్న రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇందుకోసం దాదాపు రూ.31 వేల కోట్లు అవసరం. గత ప్రభుత్వం నాలుగు విడతల్లో చేస్తామని, వడ్డీ చెల్లిస్తామని, నిర్ణయాలను వాయిదా వేస్తూ.. రైతులను సంక్షోభంలోకి నెట్టి.. వారి ఆత్మహత్యలకు కారణమైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com