TG: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. లగచర్ల భూసేకరణ రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వికారాబాద్ జిల్లా లగచర్ల భూ వివాదంలో గిరిజనుల ఆందోళనకు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. భూసేకరణ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫార్మా విలేజ్ కోసం దుద్యాల మండలం లగచర్లలో భూసేకరణను నిలిపివేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్, వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో భూసేకరణ రద్దు చేసి 24 గంటలకు గడవక ముందే ప్రభుత్వం మరో ట్విస్ట్ ఇచ్చింది. అక్కడ ఫార్మా క్లస్టర్ కోసం మాత్రమే భూసేకరణ రద్దు చేశామని తేల్చింది. పూర్తిగా అక్కడ భూసేకరణ ప్రక్రియ నిలిపివేయాలనే ఆలోచన లేదని తేల్చి చెప్పింది. పారిశ్రామిక కారిడార్ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది.
పారిశ్రామిక కారిడార్
లగచర్ల ఫార్మా క్లస్టర్ ఏర్పాటులో వెనక్కి తగ్గిన ప్రభుత్వం ఇప్పుడు అక్కడే పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు సిద్ధమైంది. ఆగస్టులో ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వికారాబాద్ జిల్లా దూద్వాల్ మండలం,పోలేపల్లి గ్రామంలో 71 ఎకరాల 39 గుంటల భూమి సేకరించేందుకు ఈ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. 2013 చట్టం సెక్షన్ 6(2) కింద ఈ కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. ఫార్మా అంటే భయం, అనేక అనుమానలు ఉంటాయని అందుకే ప్రజలకు ఉపాధి కల్పించే పారిశ్రామిక కారిడార్‌కు ఎలాంటి అపోహలు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పారిశ్రామిక పార్క్ కోసం భూసేకరణ చేపట్టేందుకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఫార్మాక్లస్టర్ ఎక్కడంటే...
తాండూరు సబ్ కలెక్టర్‌ను భూసేకరణ అధికారిగా నియమిస్తూ ఈ కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధిలో దుద్యాల మండలంలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. దాదాపు 15 వందల ఎకరాలు సేకరణకు నోటిఫికేషన్ ఆగస్టులో ఇచ్చారు. తమ భూములు ఇచ్చేది లేదని రైతులు ఆందోళనకు దిగారు. ఆగస్టు నుంచి ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ప్రజాభిప్రాయాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న ప్రజలు నవంబర్ 11న లగచర్లలో జరిగిన గ్రామసభలో అధిరాలుపై దాడి చేశారు. రైతులతో మాట్లాడేందుకు అధికారులను పిలిచి దాడి చేశారని పోలీసులు గుర్తించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com