TS: అయిదు పథకాలకు ఒకే దరఖాస్తు

ఆరుగ్యారంటీల్లో ఐదు పథకాలకు ఒకే దరఖాస్తును తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మహాలక్ష్మి, రైతుభరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు ఒకే దరఖాస్తును నింపాలి. ఆధార్, తెల్లరేషన్ కార్డు జిరాక్స్ ప్రతిని జత పరచాలి. ఇప్పటికే ఫించను పొందుతున్న లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసే ఉద్యమకారులు F.I.R నంబరును ప్రస్తావించాలి. దరఖాస్తుల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదు పథకాల కోసం ఒకే దరఖాస్తులను ప్రభుత్వం ఖరారు చేసింది. మహాలక్ష్మి, రైతుభరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాల కోసం అందులోనే వివరాలు సమర్పించాలి. ఇంటి యజమాని పేరు, పుట్టిన తేదీ, సామాజిక వర్గం, ఆధార్, రేషన్ కార్డు, మొబైల్ నంబరు, వృత్తి, చిరునామా, కుటుంబ సభ్యులందరి వివరాల వంటి పది అంశాలను పూరించాలి. ఆ తర్వాత అభయహస్తం గ్యారంటీ పథకాల్లో దేనికి దరఖాస్తు చేస్తున్నారో వాటికి టిక్ చేయాలని దరఖాస్తులో పేర్కొన్నారు.
మహాలక్ష్మి పథకంలో మహిళలకు నెలకు 2 వేల 500 రూపాయల ఆర్థిక సాయంతోపాటు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఉంటాయి. గ్యాస్ సిలిండర్ పథకం కోసం దరఖాస్తు చేయాలనుకుంటే... గ్యాస్ కనెక్షన్ నంబరు, కంపెనీ పేరుతోపాటు ఏడాదినికి ఎన్ని సిలిండర్లు వినియోగిస్తున్నారో వివరాలను పూరించాలి. రైతుభరోసా పథకంలో రైతులకు ఎకరానికి 15వేల రూపాయలు, వ్యవసాయ కూలీలకు ఏటా 12వేల రూపాయలు లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. రైతా.. కౌలు రైతా పేర్కొనడంతో పాటు.. పట్టాదారు పాస్ పుస్తకం నంబర్లు, సాగు చేస్తున్న భూమి వివరాలను దరఖాస్తులో ప్రస్తావించాలి. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయంతో పాటు అమరవీరులు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయింపు కోసం లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అమరవీరుల కేటగిరీలో దరఖాస్తు చేస్తే అమరవీరుల పేరు, సంవత్సరం, మరణధ్రవీకరణ పత్రం నంబరు, ఎఫ్ఐఆర్ వివరాలను పొందుపరచాలి. ఉద్యమకారుల కోటాలో దరఖాస్తు చేసినట్లయితే కేసు నమోదైన సంవత్సరం, ఎఫ్ఐఆర్.. ఒకవేళ జైలుకెళ్లినట్లయితే జైలుపేరు, శిక్ష వివరాలను ప్రస్తావించాలని దరఖాస్తులో పేర్కొన్నారు. కుటుంబానికి ప్రతినెలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చే గృహజ్యోతి పథకం కోసం దరఖాస్తు చేస్తే విద్యుత్ మీటర్ కనెక్షన్ నంబరు పేర్కొనడంతోపాటు.. నెలకు ఎన్ని యూనిట్లు వాడుతున్నారో ప్రస్తావించాలి.
చేయూత పథకం కింద నెలకు 4వేల రూపాయల ఫించను.. దివ్యాంగులకు నెలకు 6వేల రూపాయలు ఇవ్వనున్నారు. ఈ పథకం కింద దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ నంబరును దరఖాస్తులో పేర్కొనాలి. వృద్ధాప్య, వితంతు, గీత, చేనేత కార్మికులు, డయాలిసిస్, ఎయిడ్స్, ఫైలేరియా బాధితులు, బీడికార్మికులు, ఒంటరి మహిళలు, బీడీ టేకేదారులు కూడా ఫించను కోసం ఇదే దరఖాస్తులో నింపాలి. అయితే ఇప్పటికే ఫించను పొందుతున్న వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని దరఖాస్తులోనే పేర్కొన్నారు. దరఖాస్తుతోపాటు ఆధార్, తెల్లరేషన్ కార్డు జిరాక్స్ ప్రతిని జత పరిచి.. .వివరాలన్నీ వాస్తవమేనని ధ్రువీకరిస్తూ సంతకం చేయాలి. దరఖాస్తులో కింద ఉన్న ప్రజాపాలన రశీదుకు అధికారులు నంబరు కేటాయించి ఇస్తారు. దరఖాస్తుల ద్వారా అందిన సమాచారం ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని సీఎం వెల్లడించారు. సమాచారం ఆధారంగా ఏయే పథకాన్ని ఎందరు ఆశిస్తున్నారు.. ఎంత ఖర్చవుతుందనే అంచనా వేసి అమలు చేయవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com