TS: తెలంగాణకు దిగ్గజ కంపెనీల క్యూ

దావోస్‌లో పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ప్రభుత్వం విజయవంతం అయింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్.. పెట్టుబడులకి ఉన్న అవకాశాలను వివరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ప్రపంచ స్థాయి కంపెనీలను ఆకట్టుకుంది. దీంతో ఊహించిన దానికంటే ఎక్కువ పెట్టుబడులను సమీకరించింది. తెలంగాణ ఆవిర్భావం అయినప్పటి నుంచి ఇవే భారీ పెట్టుబడులు కావడం గమనార్హం. ఈ ఒప్పందాలతో దాదాపు 50 వేల ఉద్యోగాలు రానున్నాయి.
అమెజాన్ రూ. 60 వేల కోట్లు
హైదరాబాద్‌లో ఏకంగా 60,000వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ కంపెనీ అంగీకరించింది. డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అమెజాన్ ఇప్పటికే నగరంలో మూడు డేటా సెంటర్లను నిర్మించింది. అవి ఇప్పటికే పనిచేస్తున్నాయి. విస్తరణలో భాగంగా మరిన్ని నెలకొల్పనుంది. దావోస్ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబుతో అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంఖే భేటీ అయ్యారు. దాదాపు రూ.60,000 కోట్ల పెట్టుబడుల ప్రణాళికలను వివరించారు. హైదరాబాద్‌లోని తమ అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్లను పెద్ద ఎత్తున విస్తరిస్తామని తెలిపారు. ఇందుకు అవసరమైన భూమిని కేటాయించాలని అభ్యర్థించింది. రాష్ట్ర ప్రభుత్వం అందుకు అంగీకరించింది.
సన్ పెట్రో కెమికల్స్ భారీ పెట్టుబడి
దేశంలో ఇంధన రంగంలో పేరొందిన సంస్థ సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్రంలో రూ.45500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో భారీ పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్తు, సోలార్ విద్యుత్తు ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది.
15 వేల కోట్లతో టిల్మాన్ గ్లోబల్స్ డేటా సెంటర్
హైదరాబాద్‌లో అత్యాధునిక డేటా సెంటర్‌ను అభివృద్ధి చేసేందుకు టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ ముందుకొచ్చింది. రూ.15 వేల కోట్ల పెట్టుబడులతో 300 మెగావాట్ల సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రెసిడెంట్ సచిత్ అహూజాతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తెలంగాణలో ఉన్న మౌలిక సదుపాయాలు, దార్శనిక నాయకత్వం తమను ఆకట్టుకున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామి కావడంపై సంతోషం వ్యక్తం చేశారు.
విప్రో కొత్త క్యాంపస్
హైదరాబాద్‌లో తమ క్యాంప్‌సను విస్తరించనున్నట్లు విప్రో కంపెనీ ప్రకటించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని గోపనపల్లిలో కొత్తగా మరో ఐటీ సెంటర్ నెలకొల్పనుంది. దీంతో అదనంగా 5000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. సదస్సులో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబుతో విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ సమావేశమయ్యారు. అనంతరం కీలక ప్రకటన విడుదల చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com