SAD: నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై దిగ్ర్భాంతి

SAD: నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై దిగ్ర్భాంతి
సమగ్ర నివేదిక ఇవ్వాలని గవర్నర్‌ తమిళి సై ఆదేశం... రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

హైదరాబాద్‌ మహానగరం మరోసారి ఉలిక్కి పడింది. గతేడాది రూబీ హోటల్‌, ఈ ఏడాది దక్కన్ మాల్, స్వప్నలోక్‌ ఉదంతాలు మరువకముందే నాంపల్లిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. నాంపల్లి అగ్నిప్రమాద ఘటన పట్ల గవర్నర్‌, ముఖ్యమంత్రి సహా వివిధ పార్టీల నేతలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదం కారణాలపై రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్‌ను గవర్నర్‌ ఆదేశించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం 5లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఘటనాస్థలిని పరిశీలించిన వివిధ పార్టీల నాయకులు.... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ నాంపల్లి బజార్ ఘాట్ ఘటన జరిగిన అగ్ని ప్రమాదంపై గవర్నర్ తమిళిసై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో ఉన్నవారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించిన ఆమె ఘటనకు కారణాలు, తీసుకున్న చర్యలపై రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని CSను ఆదేశించారు.


మృతుల కుటుంబాలకు CM కేసీఆర్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. తక్షణమే పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. తీవ్రంగా గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రమాదం జరిగిన భవనాన్ని పరిశీలించిన మేయర్‌ విజయలక్ష్మి అధికారులతో ఆరా తీశారు. ఘటనాస్థలిని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ప్రమాద తీరు, సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్న ఆయన.... ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు 5లక్షల చొప్పున పరిహారం అందిస్తామని కేటీఆర్ ప్రకటించారు.


ప్రభుత్వ నిర్లక్ష్యధోరణితోనే ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపించాయి. ప్రమాదం పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన TPCC అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి... హైదరాబాద్ అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారిపోయిందన్నారు. నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఘటనాస్థలిని కాంగ్రెస్ నేతలు వి.హన్మంతరావు, ఫిరోజ్ ఖాన్, CPI నేతలు నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, అజీజ్‌పాషా పరిశీలించారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని వారు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రమాదకర రసాయనాల గోదాం నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోలేదంటూ VH హనుమంతరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బజార్‌ఘాట్‌లో ప్రమాద స్థలాన్ని భాజపా తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ప్రమాదతీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉస్మానియా మార్చురీ వద్దకు వెళ్లిన నాంపల్లి MLA జాఫర్ హుస్సేన్ మృతుల కుటుంబీకులను ఓదార్చారు.

Tags

Read MoreRead Less
Next Story