Telangana MBBS : తెలంగాణ ఎంబీబీఎస్ అభ్యర్ధులకు గుడ్ న్యూస్..

Telangana MBBS : స్వరాష్ట్రంలో డాక్టర్ చదవాలనుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో.. ఎంబీబీఎస్, బీడీఎస్ బి-కేటగిరీ సీట్లలో కేటాయించే 35 శాతం సీట్లలో 85శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కేలా అడ్మిషన్ల నిబంధనలు సవరిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో నెంబర్ 129, 130ని ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని మొత్తం 24 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని ఒకవేయి 68 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థులకే లభించనున్నాయి.
తెలంగాణలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మొత్తం 3వేల 750 సీట్లు అందుబాటులో ఉన్నాయి. నాన్ మైనారిటీ కాలేజీల్లో 3వేల 200 సీట్లు ఉండగా, ఇందులో బీ-కేటగిరీ కింద 1120 సీట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు వీటికి అన్ని రాష్ట్రాల విద్యార్థులు అర్హులుగా ఉన్నారు. తాజా సవరణతో బి-కేటగిరీలో ఉన్న 35శాతం సీట్లలో 85 శాతం సీట్లు.. అంటే 952 సీట్లు ప్రత్యేకంగా తెలంగాణ విద్యార్థుల కోసం కేటాయిస్తారు. మిగతా 168 సీట్లు మాత్రమే ఓపెన్ కోటాలో ఇతర రాష్ట్ర విద్యార్థులు పోటీ పడతారు.
ఓపెన్ కోటా కాబట్టి ఇందులో తెలంగాణ విద్యార్థులకు కూడా అవకాశం ఉంటుంది. ఇదే విధంగా మైనార్టీ కాలేజిలో 25 శాతం బి-కేటగిరీ కింద ఇప్పటి వరకు 137 సీట్లు ఉన్నాయి. తాజా సవరణతో ఇందులోనూ 116 సీట్లు ఇక్కడి విద్యార్థులకే దక్కనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com