School Holiday: రేపు తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు..
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు (సెప్టెంబర్ 2) రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలు, వరదల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. అలాగే అన్ని ప్రభుత్వ శాఖల సెలవులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అధికారులతో పాటు మంత్రులు కూడా 24 గంటలూ అందుబాటులో ఉండాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. చాలా చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. రోడ్లపై నీరు ఉంటే ఆ రోడ్లపైకి వాహనాలను అనుమతించడం లేదన్నారు. హైవేలపై నదులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
రేపు సాయంత్రం వరకు ప్రజలు బయటకు రావద్దని సూచించారు. ఈమేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని అన్ని ప్రైవేట్ పాఠశాలలకు స్థానిక పరిస్థితులను బట్టి సెలవు ప్రకటించాలా వద్దా అనే అంశంపై ఆయా జిల్లాల కలెక్టర్లు సమీక్షించి నిర్ణయం తీసుకోవాలి. కాగా, శనివారం రాత్రి నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఎవరూ సెలవు తీసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com