Telangana Budget: రానున్న ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కసరత్తు ప్రారంభం

రానున్న ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. 2024-25 ఆర్థిక సంవత్సర వార్షిక ప్రణాళిక కోసం ప్రతిపాదనలు ఇవ్వాలని అన్ని శాఖలను ఆర్థికశాఖ కోరింది. వచ్చే నెల తొమ్మిదో తేదీ వరకు గడువు ఇచ్చారు. మారిన ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదనలు పంపాలని స్పష్టం చేసింది. గ్యారంటీలను దృష్టిలో ఉంచుకొని ఈ సూచన చేసింది. కార్పోరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికిల్స్‌కు సంబంధించిన రుణాల వివరాలను కూడా పూర్తిగా ఇవ్వాలని ఆర్థిక శాఖ తెలిపింది.
ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఆ లోగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెడ్‌ను తయారు చేసి ఉభయసభల ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆర్థికశాఖ కసరత్తు ప్రారంభించింది. బడ్జెట్ తయారీ కోసం ప్రతిపాదనలు ఇవ్వాల్సిందిగా అన్ని శాఖలకు స్పష్టం చేసింది. వచ్చే నెల తొమ్మిదో తేదీ వరకు ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపింది. ఆన్‌లైన్‌లోనే ప్రతిపాదలను స్వీకరించనున్నారు. ఇందుకోసం వెబ్‌సైట్ మంగళవారం నుంచి అందుబాటులోకి రానుంది. ప్రతిపాదనలను 11వ తేదీ వరకు ఆర్థికశాఖకు సమర్పించాలని తెలిపింది. 11వ తేదీ తర్వాత ప్రతిపాదనలు సమర్పిస్తే.. మార్పులు, చేర్పులకు ఇబ్బందులు ఎదురవుతుందని పేర్కొంది. బడ్జెట్ కసరత్తులో భాగంగా కేడర్ వారీగా పోస్టులు, ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల వివరాలు.. నిర్ణీత నమూనాలో సమర్పించాల్సి ఉంటుంది. కొత్తగా చేరే అవకాశం ఉన్న ఉద్యోగుల సంఖ్యను కూడా ఇవ్వాలన్న ఆర్థికశాఖ... ఆరో తేదీ లోపు అప్‌లోడ్ చేయాలని తెలిపింది.
బడ్జెట్ కసరత్తులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సవరించిన అంచనాల్లో... బడ్జెట్ మొత్తం పెంచడాన్ని అంగీకరించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుత పన్నులు, ధరలను దృష్టిలో ఉంచుకొని.. 2024-25లో వచ్చే రాబడుల వివరాలను పేర్కొనాలి. రాబడులను పెంచుకునే విషయంతోపాటు లీకేజీలను అరికట్టే విషయమై దృష్టి సారించాలని.., లక్ష్యాలు నిర్ధేశించాలని స్పష్టం చేసింది. రానున్న ఆర్థిక సంవత్సరంలో వ్యయం అయ్యే మొత్తానికి సంబంధించిన వివరాలను నిర్వహణా వ్యయం, పథకం వ్యయం కింద ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలు మారిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా పథకాలకు కేటాయింపులు ప్రతిపాదించాలని, ఆ అవసరాలను దృష్టిలో ఉంచుకొని... సమీక్షించుకొని ప్రతిపాదనలు రూపొందించాలని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. ఏవైనా కొత్త పథకాలు ప్రతిపాదిస్తే అవి ప్రారంభమయ్యే అవకాశం ఉన్న తేదీ, అంచనా వ్యయం తదితర వివరాలను పొందుపర్చాలని తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com