Telangana Government : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

Telangana Government : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయ మార్గాల దిశగా ప్రభుత్వ భూములు విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ మరో దఫా సిద్ధమైంది. ఇప్పటికే కోకాపేట్, ఖానామెట్, ఉప్పల్ భగాయత్ భూముల విక్రయం విజయవంతంగా పూర్తి చేసిన అధికారులు.. తాజాగా బహదూర్‌పల్లి, తొర్రూరులోని భూముల విక్రయానికి రంగం సిద్ధం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలోని బహదూర్‌పల్లి, రంగారెడ్డి జిల్లా పరిధి తొర్రూరులోని ప్లాట్లను ఆన్‌లైన్ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎం.ఎస్.టి.సి ఆధ్వర్యంలో ఈ- వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ ఏర్పాట్లు పూర్తి చేసింది. మల్టీపర్పస్ జోన్ కింద ఉన్న ఈ రెండు లే అవుట్లను హెచ్‌ఎండీఏ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనుంది. బహదూర్‌పల్లిలోని 101 ప్లాట్లు వచ్చే నెల 14, 15 తేదీల్లో, తొర్రూర్‌లోని 223 ప్లాట్లను వచ్చే నెల 14 నుంచి 17 వరకు ఈ-వేలం వేస్తామని అధికారులు తెలిపారు.
బహదూర్‌పల్లిలో 40 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న లేఅవుట్‌లో 101 ప్లాట్ల విక్రయాలకు సంబంధించి 23న ప్రీ బిడ్ మీటింగ్ జరగనుంది. బహదూర్‌పల్లిలోని మేకల వెంకటేశ్ ఫంక్షన్ హాల్‌లో ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రీ బిడ్ మీటింగ్ ప్రారంభం కానుంది. ఈనెల 25న తొర్రూరు సైట్‌లో ప్రీ బిడ్ సమావేశం జరగనుంది. తొర్రూర్‌లో 117 ఎకరాల విస్తీర్ణంలో హెచ్‌ఎండీఏ లేఅవుట్‌కు సంబంధించిన 223 ప్లాట్లను ఈ వేలం ద్వారా విక్రయించనున్నట్టు అధికారులు వెల్లడించారు.
బహదూర్‌పల్లిలో గజానికి 25 వేల రూపాయలు, తొర్రూర్‌లో గజానికి 20 వేల కనీస ధరను నిర్ణయించింది. బహదూర్‌పల్లిలో 600 గజాల వరకు ఒక్కో ప్లాటుకు 3 లక్షలు, 600 గజాలు దాటితే 5 లక్షల రూపాయలు... అలాగే తొర్రూరులో ఒక్కో ప్లాట్‌కు లక్ష చొప్పున ధర నిర్ణయించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com