Telangana Budget 2024: సాగు, సంక్షేమానికి పెద్ద పీట

Telangana Budget 2024: సాగు, సంక్షేమానికి పెద్ద పీట
X
తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.... రూ. .2.91 లక్షల కోట్ల బడ్జెట్‌

తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. మొత్తం 2 లక్షల 91 వేల 159కోట్లతో బడ్జెట్‌ను అసెంబ్లీలో ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. వ్యవసాయానికి అత్యధికంగా 72 వేల 659 కోట్ల రూపాయలు కేటాయించారు. నిజాం షుగర్స్‌ను తిరిగి ప్రారంభిస్తామని ఆర్థికమంత్రి తెలిపారు. తెలంగాణ బడ్జెట్‌లో విద్యకు పెద్ద పీట వేశారు. విద్యకు 21 వేల 292 కోట్ల రూపాయలు కేటాయించారు. వైద్య, ఆరోగ్య శాఖలకు 11 వేల 468 కోట్లు ఇచ్చారు. నీటి పారుదల రంగానికి 22 వేల 301 కోట్లు కేటాయించారు. రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్‌లో సంక్షేమం, వ్యవసాయ రంగాలకే రూ.1.10 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించి తమ ప్రాథమ్యాలను చాటింది. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేసింది. మొత్తంగా సంక్షేమం, సాగు రంగాలే గుండెగా 2024-25 బడ్జెట్‌ను గురువారం ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.


పన్నేతర ఆదాయం గతేడాది రూ.23,819 కోట్లు రాగా ఈ ఏడాది రూ.35,208 కోట్లు వస్తుందని అంచనా వేసింది. రాష్ట్ర రెవెన్యూ రాబడి పద్దు కింద వచ్చే మొత్తం రూ.2.21 లక్షల కోట్లలో... పన్నుల ద్వారా ఆదాయం రూ.1.38 లక్షల కోట్లు, పన్నేతర ఆదాయం రూ.35,208 కోట్లు అత్యంత కీలకం. సంక్షేమ పథకాలకు ఈ నిధులు కీలకంగా మారనున్నాయి. ఇక మద్యంపై ‘ఎక్సైజ్‌ సుంకం’ పద్దు కింద వచ్చే ఆదాయం గతేడాదితో పోలిస్తే రూ.20,298 కోట్ల నుంచి రూ.25,617 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. మద్యం అమ్మకాలు భారీగా పెరిగేతేనే అదనంగా మరో రూ.5,319 కోట్ల ఆదాయం ‘ఎక్సైజ్‌ సుంకం’గా వస్తుంది. మద్యం, పెట్రోలు, డీజిల్‌ అమ్మకాలు పెరిగితే వ్యాట్‌ కూడా రూ.33,449 కోట్లు వస్తుందని అంచనా వేసింది.

ఈ ఏడాది పన్నుల ద్వారా ఆదాయంలో 24 శాతానికిపైగా వృద్ధిరేటు నమోదవుతుందని ఈ శాఖ ధీమా వ్యక్తం చేస్తోంది. రోడ్లు, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కొత్త పాలసీలు తీసుకురానున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి గ్రామం నుంచి మండలానికి, అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి డబుల్‌ రోడ్లు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు 4 వరసల తారురోడ్లు నిర్మించేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు వివరించింది. మొత్తం అన్ని పథకాలకు కలిపి రూ.లక్షా 55 వేల కోట్లకుపైగా కేటాయించింది. ఈ పథకాల ద్వారా పేదలకు అధిక లబ్ధి చేకూరడమే కాకుండా అభివృద్ధి పరుగులు తీస్తుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.

Tags

Next Story