Telangana Assembl: రూ.6,71,757 కోట్లకు పెరిగిన తెలంగాణ అప్పు..

Telangana Assembl: రూ.6,71,757 కోట్లకు పెరిగిన తెలంగాణ అప్పు..
మాట్లాడేందుకు తొలుత హరీశ్ కు అవకాశం ఇచ్చిన స్పీకర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం తిరిగి ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. మొత్తం 42 పేజీల శ్వేతపత్రాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో విడుదల చేశారు. ప్రజలంతా అభివృద్ధి చెందాలని తెలంగాణ సాధించుకున్నామని, కానీ, గత ప్రభుత్వం రాష్ట్రంలోని వనరులను సక్రమంగా ఉపయోగించలేదని తెలిపారు. రోజువారీ ఖర్చులకూ ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందని, ఇలాంటి పరిస్థితి రావడాన్ని దురదృష్టంగా భావిస్తున్నానని భట్టి అన్నారు. పదేళ్ల కాలంలో జరిగిన ఆర్థిక తప్పిదాలు ప్రజలకు తెలియాలని, అందుకే శ్వేతపత్రం ద్వారా వివరాలను వెల్లడించడం జరిగిందని తెలిపారు.

వెంటనే ఈ అంశంపై చర్చను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రారంభించారు. మాట్లాడేందుకు తొలుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు అవకాశం ఇచ్చారు. హరీశ్ రావు మాట్లాడుతూ... 42 పేజీల నోట్ ఇచ్చి 4 నిమిషాలు కూడా కాలేదు... దీన్ని చదవకుండా ఏం మాట్లాడాలి అధ్యక్షా? అని అన్నారు. నోట్ ను చదవడానికి తమకు కొంత సమయం కావాలని చెప్పారు. ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ... ఒక గంట సేపు టీ బ్రేక్ ఇస్తే నోట్ ను చదువుకుంటామని కోరారు. అలాగే సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు కూడా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సభకు అరగంట టీ బ్రేక్ ను స్పీకర్ ఇచ్చారు.

రాజకీయ కారణాల రీత్యా కాంగ్రెస్‌ నాయకులు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా.. తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బలపడటానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బలమైన పునాదులు వేసిందని హరీశ్‌రావు అన్నారు. సువిశాలమైన ప్రగతి దారులను నిర్మించిందన్నారు. కొత్త ప్రభుత్వం ఆ దారుల వెంట ముందడుగు వేస్తూ ప్రజలే కేంద్రంగా పనిచేయాలన్నారు. రాజకీయ కక్షల చుట్టూ పరిభ్రమించే వైఖరికి భిన్నంగా.. అభివృద్ధి కక్షలో పరిభ్రమిస్తే వారికి మంచిది.. ప్రజాస్వామ్య వ్యవస్థలకు మంచిదని సూచించారు. కానీ ఈ సభలో ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు.. శ్వేతపత్రం తీరును చూస్తుంటే ప్రజలు, ప్రగతి అనే కోణం కన్నా.. రాజకీయ ప్రత్యర్థులపై దాడి, వాస్తవాల వక్రీకరణ కోణమే కనిపిస్తుందన్నారు.


Tags

Read MoreRead Less
Next Story