కరోనా విజృంభణతో తెలంగాణ సర్కార్ ఆంక్షలు.. మాస్క్ తప్పనిసరి..!

కరోనా విజృంభణతో తెలంగాణ సర్కార్ ఆంక్షలు.. మాస్క్ తప్పనిసరి..!
తెలంగాణలో కరోనా విజృంభణ రోజురోజుకు పెరుగుండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేసింది.

తెలంగాణలో కరోనా విజృంభణ రోజురోజుకు పెరుగుండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేసింది. బహిరంగ ప్రదేశాలతో పాటు ప్రయాణాలు, పని ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. నింబధనలు ఉల్లఘించింన వారిపై విపత్తు నిర్వహణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, పోలీసులను ఆదేశించింది. ఈ చట్టం ప్రకారం వెయ్యి రూపాయల జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. మరోవైపు వేడుకలపైనా నిషేధం విధించింది. ఏప్రిల్ 30వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొంది.

హోలీ, ఉగాది, శ్రీరామనవమి, రంజాన్, గుడ్ ఫ్రైడే వంటి పండుగలపై ఆంక్షలు విధిస్తూ సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పండుగల వేళ బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు, ర్యాలీలు, వేడుకలు నిర్వహించడంపై ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ నిబంధనలు తప్పకుండా అమలయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో హలీ వేడుకలపై పోలీసులు దృష్టి సారించారు. హోలీ పేరిట రోడ్లపైకి వచ్చిన ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదని, బలవంతంగా ఇతరులపై రంగు నీళ్లు చల్లడం, గుంపులు గుంపులుగా తిరగడం వంటివి చేయకూడదని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆంక్షల్లో భాగంగా ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలపైనా నిషేధం విధించారు.

మరోవైపు తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు అన్నారు. గత మార్చ్ నుంచి ఇప్పటివరకు కోటికి పైగా కరోనా పరీక్షలు చేశామని.. రోజుకు సుమారు 50వేల టెస్టులు చేస్తున్నట్లు తెలిపారు. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందన్నారు. ఇక సెకండ్ వేవ్ మొదలైందని.. ప్రజలు నిర్లక్ష్యం వహించొద్దని.. కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటిన వారందరికీ టీకా ఇవ్వనున్నామని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story