Hyderabad : జిమ్‌ఖానా గ్రౌండ్ తొక్కిసలాట వ్యవహారంపై తెలంగాణ సర్కార్ సీరియస్..

Hyderabad : టికెట్ల అమ్మకాల్లో గందరగోళం, జింఖానా మైదానం దగ్గర తొక్కిసలాట ఘటనతో పాటు HCA వ్యవహారాన్ని తెలంగాణ సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనపై వెంటనే రివ్యూ నిర్వహించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. రవీంద్రభారతిలో జరిగిన ఈ సమావేశానికి HCA ప్రెసిడెంట్ అజారుద్దీన్, రాచకొండ సీపీ మహేష్ భగవత్ సహా ఇతర అధికారులు హాజరయ్యారు. టికెట్ అమ్మకాలు, జింఖానా మైదానంలో తొక్కిసలాట, లాఠీఛార్జ్‌పై సమావేశంలో చర్చించారు.
జింఖానా గ్రౌండ్‌లో HCA వైఫల్యం వల్లే ఘటన జరిగిందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవడంలో HCA విఫలమైందన్నారు. టికెట్లు ఆలస్యంగా ఆఫ్‌లైన్‌లోకి తేవడం వల్లే సమస్య తలెత్తిందన్నారు. టికెట్ల అమ్మకం గురించి ముందే సమాచారం ఇచ్చి ఉంటే ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించే వాళ్లమన్నారు. జింఖనాలో గాయపడిన వారికి ప్రభుత్వం లేదా HCA తరపున పూర్తి స్థాయి చికిత్స అందిస్తామన్నారు. హైదరాబాద్ ప్రతిష్ట దిగజార్చే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదన్నారు.
ఐతే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎదుట అజారుద్దీన్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి.జింఖానా గ్రౌండ్‌లో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగినా...ఇలాంటివి సహజమే అన్నట్లుగా అజహార్ వ్యవహరించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై రివర్స్ అటాక్ చేశారు. మ్యాచులు నిర్వహించడం కూర్చొని మాట్లాడినంత ఈజీ కాదన్నారు. తనకు మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన పనులు చాలా ఉన్నాయని...మీతో మాట్లాడే సమయం లేదని మంత్రితో చెప్పినట్లు తెలుస్తోంది. అజారుద్దీన్ తీరుతో అక్కడి వారంతా షాక్‌కు గురైనట్లు సమాచారం. ఇక టికెట్లకు సంబంధించిన వివరాలన్ని ప్రభుత్వానికి ఇస్తామని చెప్పారు అజారుద్దీన్.
ఇక ఆఫ్‌లైన్ టికెట్లు పూర్తిగా అయిపోయాయని ప్రకటించారు. ఐతే గురువారం సాయంత్రం ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. పేటీఎం ఇన్‌సైడర్ యాప్‌లో టికెట్లు అమ్ముతామని ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com