కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కఠిన నిబంధన.. మాస్కులు లేకుండా తిరిగితే రూ.1000 జరిమానా..!

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కఠిన నిబంధన విధించింది. బహిరంగ ప్రదేశాలు, పనిచేసే ప్రాంతాలు, ప్రయాణాల్లో మాస్కు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. మాస్కులు లేకుండా తిరిగితే వెయ్యి రూపాయలు జరిమానా విధించనున్నట్టు జీవో విడుదల చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. పలు జిల్లాల్లో రికార్డుస్థాయిలో కోవిడ్ కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రోజూ 2వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా రోజుకు నాలుగు వందలకు పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి.
కరోనా ఉధృతి పెరుగుతున్న వేళ ప్రభుత్వం.. హైదరాబాద్‌లో 4 కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. బేగంపేట్‌లోని నేచర్ క్యూర్ హాస్పిటల్, ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, చార్మినార్‌లోని నిజామియా టీబీ ఆస్పత్రి, మెహిదీపట్నంలోని సరోజినీ కంటి ఆస్పత్రిలో కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది.
కోవిడ్ నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ప్రభుత్వం... ఈ మేరకు ప్రత్యేకమైన జీవో జారీ చేసింది.సెకండ్ వేవ్‌లో కరోనా కేసులు గణనీయంగా పెరగడంపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇఫ్పట మాస్క్ లేకుండా బయట తిరిగితే కేసులు నమోదు చేస్తామని స్పష్టంచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com