TG: కొన్ని బీసీ కులాల పేర్లు మార్పు

TG: కొన్ని బీసీ కులాల పేర్లు మార్పు
X
సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్

తెలంగాణలో వెనుకబడిన తరగతుల సామాజిక గౌరవాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నో ఏళ్లుగా తమ కులాల పేర్ల వల్ల అవమానాలు, వివక్ష ఎదుర్కొంటున్న పలు వర్గాల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, బీసీ కమిషన్ సిఫార్సుల మేరకు కొన్ని కులాల పేర్లను మార్చుతూ, మరికొన్ని కులాలకు గౌరవప్రదమైన పర్యాయపదాలను జోడిస్తూ రాష్ట్ర కేబినెట్‌లో ఆమోదం తెలిపింది. ఈ మార్పులు అధికారిక రికార్డుల్లో త్వరలోనే అమల్లోకి రానుండటం విశేషం. ముఖ్యంగా బీసీ గ్రూప్-ఏ, గ్రూప్-డి జాబితాల్లో ఈ సవరణలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బీసీల స్థితిగతులపై అధ్యయనం చేపట్టిన బీసీ కమిషన్‌కు, పలు వర్గాల ప్రజలు తమ కులాల పేర్ల వల్ల సామాజికంగా అవమానాలు ఎదురవుతున్నాయని వినతులు సమర్పించారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న కమిషన్, జిల్లాల వారీగా పర్యటించి బాధిత వర్గాల అభిప్రాయాలు సేకరించింది. అనంతరం క్షేత్రస్థాయి పరిశీలనలు, ప్రజల అభ్యంతరాలు, సూచనలు పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ముందు తగిన సిఫార్సులు ఉంచింది. ఆ సిఫార్సులను రాష్ట్ర మంత్రివర్గం తాజాగా ఆమోదించింది.

తిట్టు వచ్చే కులాల పేర్లు మార్పు

ఈ నిర్ణయాల ప్రకారం బీసీ గ్రూప్-ఏ జాబితాలోని పలు కులాల పేర్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు అధికారిక రికార్డుల్లో ఉన్న ‘దొమ్మర’ అనే పదాన్ని తొలగించి, దాని స్థానంలో ‘గడ వంశీయ’ అనే పేరును ప్రభుత్వం ఖరారు చేసింది. అలాగే ‘పిచ్చకుంట్ల’ అనే పదాన్ని తొలగిస్తూ, ఇకపై ఆ వర్గాన్ని ‘వంశ రాజ్’ పేరుతో గుర్తించనున్నారు. బుడబుక్కల కులానికి ‘శివ క్షత్రియ’ అనే గౌరవప్రదమైన పర్యాయపదాన్ని చేర్చడంతో, రికార్డుల్లో వీరిని ‘బుడబుక్కల, శివ క్షత్రియ’గా నమోదు చేయనున్నారు. మరోవైపు ‘వన్నార్’ అనే పదాన్ని తొలగించి, దాని స్థానంలో ‘ధోబీ’ అనే పదాన్ని చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆ వర్గం ఇకపై ‘రజక, చాకలి, ధోబీ’గా గుర్తింపు పొందనుంది. అదేవిధంగా వీరభద్రియ కులానికి సంబంధించి, వారి అభ్యర్థన మేరకు ‘వీరముష్టి, నెట్టి కోటల’ అనే పదాలను కూడా పర్యాయపదాలుగా చేర్చారు. ఇక బీసీ గ్రూప్-డి విభాగంలో కూడా ప్రభుత్వం పలు కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా చాలా కాలంగా వివాదాస్పదంగా ఉన్న ‘శూద్ర కులం’ అనే పదాన్ని పూర్తిగా తొలగించింది. దాని స్థానంలో ‘తమ్మలి (బ్రాహ్మణేతర)’ అనే పేరును చేర్చింది. అలాగే ‘మేర’ కులానికి ‘మేరు’ అనే పదాన్ని అదనంగా జోడిస్తూ, ఇకపై ‘మేర, మేరు, చిప్పోలు’గా గుర్తించాలని నిర్ణయించింది.

సమాజంలో కించపరిచేలా లేదా అవమానకరంగా భావించే పదాలను అధికారిక జాబితాల నుంచి తొలగించి, గౌరవప్రదమైన పేర్లను చేర్చడం ద్వారా ఆయా వర్గాలకు ఆత్మగౌరవాన్ని కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని బీసీ కమిషన్ వెల్లడించింది. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగార్థులు తమ కుల ధృవపత్రాలు, ఇతర అధికారిక రికార్డుల్లో గౌరవప్రదమైన పేర్లతో గుర్తింపు పొందడం వల్ల మానసికంగా కూడా ఉత్సాహం పెరుగుతుందని కమిషన్ అభిప్రాయపడింది. ఈ నిర్ణయాలపై తెలంగాణ బీసీ కమిషన్ హర్షం వ్యక్తం చేసింది. కమిషన్ చైర్మన్ నిరంజన్‌తో పాటు సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి రంగు సంయుక్త ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బీసీల సమస్యలను అర్థం చేసుకుని, సామాజిక గౌరవానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. సంచార జాతులకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ పథకాల అర్హత జాబితాల విషయంలో కూడా కమిషన్ చేసిన సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించడం సంతోషకరమని తెలిపారు. మొత్తంగా చూస్తే, కులాల పేర్లలో గౌరవప్రదమైన మార్పులు చేయడం ద్వారా సామాజిక సమానత్వానికి తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags

Next Story