Telangana governor: ఆర్టీసీ విలీనానికి గవర్నర్‌ ఆమోదముద్ర

Telangana governor: ఆర్టీసీ విలీనానికి గవర్నర్‌ ఆమోదముద్ర
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఇక ప్రభుత్వ ఉద్యోగులే... అయిదు వారాల ఉత్కంఠకు తెరదింపిన తెలంగాణ గవర్నర్‌....

తెలంగాణ RTC ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదం తెలిపారు. తను సూచనలపై సర్కార్‌ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన గవర్నర్.. బిల్లును ఆమోదిస్తూ సంతకం చేశారు. ఈ మేరకు TSRTC ఉద్యోగులందరికీ... తమిళిసై ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. గవర్నర్‌ ఆమోదంతో RTCలో పనిచేస్తున్న 43వేల 373 మంది ప్రభుత్వోద్యోగులుగా మారనున్నారు.

ఆర్టీసీ కార్మికులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఆకాంక్ష ఎట్టకేలకు ఫలించింది. ప్రజారవాణా వ్యవస్థ పటిష్ఠంతోపాటు.. RTC సేవలు మరింత విస్తృతపరిచేందుకు సంస్థలో పనిచేస్తున్న వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే బిల్లుపై గవర్నర్‌ సంతకం చేశారు. RTC కార్మికులు గతంలో సమ్మె చేసిన అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై విధివిధానాలు, నిబంధనలను రూపొందించేందుకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఆర్‌అండ్‌ బీ, రవాణాశాఖ, G.A.D. శాఖ కార్యదర్శులు, కార్మికశాఖ ప్రత్యేక కార్యదర్శి సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన బిల్లును ఇటీవల వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని భావించగా.. ఈ సమయంలోనూ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.


ఆర్థికశాఖకు చెందిన బిల్లు అయినందున సభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ అనుమతి తీసుకోవాల్సి ఉండగా పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తమిళిసై అంగీకరించలేదు. దీంతో అసెంబ్లీ సమావేశాల చివరిరోజు ఆర్టీసీ కార్మిక సంఘాలు రాజ్‌భవన్‌ ముట్టడికి యత్నించాయి. చివరికి ప్రభుత్వ వివరణతో చివరి క్షణంలో గవర్నర్‌ అంగీకారంతో సభ ముందుకు బిల్లు వచ్చింది. శాసనసభ ఆమోదం అనంతరం, ప్రభుత్వం RTC బిల్లును గవర్నర్‌ వద్దకు పంపింది.

ఆర్టీసీ బిల్లును ప్రభుత్వం గవర్నర్ కు పంపించగా పలు అంశాలపై అధికారులను ఆమె వివరణ కోరారు. ఈ మేరకు ప్రభుత్వం 10 అంశాలపై స్పందిస్తూ వివరణ ఇచ్చింది. ప్రభుత్వం వివరణతో సంతృప్తి చెందిన గవర్నర్.. బిల్లును ఆమోదిస్తూ సంతకం చేశారు. ఈ మేరకు TSRTC ఉద్యోగులందరికి తమిళిసై ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. గవర్నర్‌ ఆమోదంతో.. ఆర్టీసీలో పనిచేస్తున్న మొత్తం 43వేల 373 మంది ప్రభుత్వోద్యోగులుగా మారనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story