TG:గ్యాస్ కొరతపై తెలంగాణ సర్కార్ నజర్

పశ్చిమాసియా యుద్ధం వల్ల తలెత్తిన గ్యాస్ కొరతపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎస్ శాంతి కుమారి నేడు మధ్యాహ్నం 12 గంటలకు గ్యాస్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ముఖ్యంగా హోటళ్లు, హాస్టళ్లపై ప్రభావం చూపుతున్న కమర్షియల్ సిలిండర్ల కొరత, బ్లాక్ మార్కెటింగ్ నివారణపై ఈ భేటీలో చర్చించనున్నారు. గృహ అవసరాలకు సరఫరా సజావుగానే ఉందని, ప్రజలు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం భరోసా ఇస్తోంది.
హాస్టళ్లలో కొనసాగుతున్న కష్టాలు
గ్యాస్ కొరత దృష్ట్యా కొన్ని స్టార్ హోటళ్ల మెనూలో మార్పులు చేశారు. ఇంధనం ఎక్కువగా అవసరమయ్యే గ్రిల్డ్ చికెన్, మటన్, కబాబ్‌లను మెనూలో తొలగించారు. బంజారాహిల్స్‌లోని ఓ స్టార్ హోటల్ రోజుకు 50 సిలిండర్లను వాడుతుండగా.. సరఫరా ఉండబోదన్న అంచనాతో భోజనం తినేందుకు మాత్రమే వస్తున్నవారికి కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయని చెబుతున్నారు. హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని షాగౌస్ హోటల్లో బుధవారం మధ్యాహ్నం కట్టెల పొయ్యిపైనే బిర్యానీ చేసినట్లు యజమాని రబ్బానీ తెలిపారు. గ్రేటర్ పరిధిలోని ప్యారడైజ్ హోటళ్లలో అవసరమైన చోట్ల విద్యుత్‌పై వంటలు వండుతున్నామని నిర్వాహకులు తెలిపారు.
ఎక్కువ సంఖ్యలో ఐటీ ఉద్యోగులు వసతి పొందుతున్న ప్రైవేటు పీజీ హాస్టళ్లకు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాను వెంటనే ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ కోరింది. రాయదుర్గంలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కరుణాకర్, కోశాధికారి మహీధర్ తదితరులు మాట్లాడారు. వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిపివేయడంతో హైదరాబాద్‌లోని 11 వేల హాస్టళ్లలో వసతి పొందుతున్న 10 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. సామర్థ్యాన్ని బట్టి ఒక్కో హాస్టల్లో 100 నుంచి 300 మంది వరకు ఉన్నారని, తెలిపారు.
మన వంటింట్లో గ్యాస్ మంటలు
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో భారత్‌లో సంక్షోభం మొదలైంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కమర్షియల్ గ్యాస్ కష్టాలు మరింత పెరిగాయి. కమర్షియల్ గ్యాస్ సరఫరాను పంపిణీ సంస్థలు నిలిపివేయడంతో పలు రాష్ట్రాల్లో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఖతార్ నుంచి సరఫరా నిలిచిపోవడంతో చాలా రంగాలు ఇబ్బంది పడుతున్నాయి. జేఎం ఫైనాన్షియల్ తాజా రిపోర్టు ప్రకారం.. ఒప్పందాల ప్రకారం సరఫరా చేయలేక కొన్ని కంపెనీలు ఫోర్స్ మెజూర్ నోటీసులు జారీ చేశాయి. అంటే సరఫరా చేయలేమని చేతులెత్తేశాయి. పారిశ్రామిక వినియోగదారులకు సప్లయ్ 10–50 శాతం వరకు తగ్గింది. హైదరాబాద్‌లో గ్యాస్ కొరతతో హాస్టల్స్ మూతపడుతున్నాయి.-- తిరుపతిలో కమర్షియల్ గ్యాస్ కొరత మూలంగా భక్తుల ఇబ్బందులు పడుతున్నారు. కేరళలో రేపో ఎల్లుండో 50% హోటళ్లు మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే ముంబైలో 10వేల రెస్టారెంట్లు మూతపడటంతో 4లక్షల మంది రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. ఢిల్లీలో గ్యాస్ ఏజెన్సీల ముందు రీఫిల్లింగ్ కోసం భారీ ఎత్తున క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు. బెంగళూరు హోటళ్ల మెనూలో వంటకాలు తగ్గించారు. తమిళనాడు రెస్టారెంట్లలో ఎలక్ట్రిక్ ఓవెన్లు వినియోగిస్తున్నారు. గుజరాత్లో పలు తినుబండారాల దుకాణాలు మూతపడ్డాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
