TG: సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు

TG: సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు
X
రేషన్‌కార్డుల దరఖాస్తులకు త్వరలో మోక్షం... అత్యాధునిక సాంకేతికతో కూడిన రేషన్‌ కార్డులు

తెలంగాణలో రేషన్ కార్డులపై ప్రభుత్వ త్వరలోనే శుభవార్త చెప్పనుంది. రేషన్‌కార్డుల దరఖాస్తులకు త్వరలో మోక్షం లభించనుంది. సంక్రాంతి తర్వాత కొత్త కార్డులను జారీ చేసేందుకు రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అత్యాధునిక సాంకేతికతో కూడిన రేషన్‌ కార్డులను అర్హులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్‌ పరిధిలో రేషన్‌ కార్డుల దరఖాస్తులు కొన్ని నెలలుగా పెండింగులో ఉన్నాయి. వారిలో ఎంత మందికి కార్డులు దక్కుతాయన్నది క్షేత్రస్థాయి పరిశీలన తరవాత స్పష్టత వస్తుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సుమారు రెండున్నరేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించి అర్హులకు కార్డులను జారీ చేసింది. ఆ తర్వాత నుంచి కార్డులు జారీ చేసిన దాఖలాలు లేవు. గతంలో కార్డుల జారీ ప్రక్రియ తరచుగా జరిగేది. తెలంగాణ ప్రభుత్వం కార్డుల జారీ ప్రక్రియను ఏకీకృతం చేసింది. దీంతో ఎప్పటికప్పుడు కాకుండా ప్రభుత్వం నిర్ణయం మేరకు కార్డులు జారీ చేస్తోంది.

రేషన్‌ కార్డుల కోసం సుమారు 4.5 లక్షల దరఖాస్తులు పెండింగులో ఉన్నట్లు అధికారుల అంచనా. అధిక శాతం హైదరాబాద్‌ జిల్లా పరిధిలోనే ఉన్నట్లు చెబుతున్నారు. కొత్తగా జారీ చేసే కార్డులో ఎలక్ట్రానిక్‌ చిప్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆ చిప్‌లో కార్డుదారుడి కుటుంబ సభ్యుల సంఖ్య, చిరునామా వంటి సమాచారం ఉంటుందని చెబుతున్నారు. గ్రేటర్‌లోని మూడు జిల్లాల్లో ప్రస్తుతం సుమారు 17.21 లక్షల కార్డులు ఉన్నాయి. పెండింగులో ఉన్న దరఖాస్తుల్లో లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు అర్హులు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

సంక్రాంతి నుంచి ప్రారంభిస్తాం: మంత్రి

సంక్రాంతి నుంచి ప్రక్రియ ప్రారంభిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో ఎన్నో ఏళ్లుగా అర్హత ఉండి ఎదురు చూస్తున్న వారిలో ఆశలు చిగురించాయి. జిల్లాలో దాదాపు ఆరేళ్లకుపైగా రేషన్‌ కార్డుల కోసం నిరీక్షిస్తూ సంక్షేమ పథకాలు అందుకోలేక ఇబ్బందులు పడుతున్నవారు ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్త కార్డులు జారీ చేయకపోగా చేర్పులు మార్పులకు కూడా నోచుకోని పరిస్థితి. చేర్పులు, మార్పులకు సంబంధించి జిల్లాలో 20,606 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. రేషన్‌ కార్డుల్లో పిల్లల పేర్లు, కోడళ్ల పేర్లు చేర్చాలంటూ వేలాది మంది కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్నారు. ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంటున్నారు. వీటితోపాటు గతంలోనే రేషన్‌ కార్డుల కోసం 40 వేల మంది వరకు అర్హులు దరఖాస్తు చేసుకున్నారు.

Tags

Next Story