Telangana: నేడు మద్యం దుకాణాల లక్కీడ్రా

తెలంగాణలో 2023-25 ఎక్సైజ్ పాలసీకి సంబంధించి 2,620 మద్యం దుకాణాల కేటాయింపునకు ఇవాళ లక్కీడ్రా నిర్వహిస్తారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 34 ఎక్సైజ్ జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా రెవెన్యూ జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో, దరఖాస్తుదారుల సమక్షంలో ఉదయం 10.30 నుంచి దుకాణాల వారీగా డ్రా నిర్వహిస్తారు. శంషాబాద్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ ఎక్సైజ్ జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. దరఖాస్తులు అధికంగా వచ్చిన ఎక్సైజ్ జిల్లాల్లో లక్కీడ్రా నిర్వహణ రాత్రివరకు కొనసాగే అవకాశం ఉంది. డ్రాలో ఎంపికైన వ్యాపారులు ఈ నెల 23లోగా నిర్ణీత వార్షిక లైసెన్స్ రుసుంలో ఆరో వంతు చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్‌దారులు డిసెంబరు 1 నుంచి కొత్త మద్యం దుకాణాల్లో విక్రయాలు సాగించేందుకు అనుమతిస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు అనూహ్యంగా లక్షా 31 వేల 490 దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, సరూర్‌నగర్, శంషాబాద్ ఎక్సైజ్ జిల్లాల్లోనే 42,596 దరఖాస్తులు వచ్చాయి. ఈ ప్రాంతంలో గత పాలసీలో 18,091 దరఖాస్తులే రావడం గమనార్హం. ఈసారి చివరి రెండు రోజుల్లోనే దరఖాస్తులు భారీగా పోటెత్తాయి. చివరిరోజు శ్రావణ శుక్రవారం 50 వేలకుపైగా వచ్చాయి. అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 979, ఆసిఫాబాద్‌లో 967, నిర్మల్‌లో 1019 దరఖాస్తులొచ్చాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com