GROUP ONE: గ్రూప్-1 ఫలితాల విడుదలకు లైన్ క్లియర్

గ్రూప్-1 ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. గ్రూప్-1పై దాఖలైన 2 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. వివిధ రకాల అభ్యంతరాలతో కొందరు గ్రూప్-1 అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నేడు(సోమవారం) విచారణ చేపట్టిన ధర్మాసనం ఆ పిటిషన్లను కొట్టివేసింది. తెలంగాణ ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు.. పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. త్వరలో గ్రూప్-1 ఫలితాలు విడుదల చేయనుంది. కేసుల అడ్డంకులు తొలిగిపోవడంతో త్వరలో గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే మార్చిలోపు గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేస్తామని.. ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు. సీఎం ప్రకటన.. సుప్రీంకోర్టు తీర్పుతో అధికారులు గ్రూప్ వన్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి గ్రూప్-1 నియామకాలు ఇవే కావడం విశేషం.
హైకోర్టు తిరస్కరించడంతో...
తెలంగాణ హైకోర్టు తమ పిటిషన్‌లను కొట్టేయడంతో గ్రూప్ వన్ అభ్యర్థులు సుప్రీంను ఆశ్రయించారు.ఫలితాలు వెల్లడించడంపై తెలంగాణ ప్రభుత్వ వాదనతో సుప్రీంకోర్టు అంగీకరించింది. కేసుల అడ్డంకులు తొలగిపోవడంతో,త్వరలో టీజీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాలు విడుదల చేయనుంది.
గ్రూప్ 1 పరీక్షలు ఎప్పుడు జరిగాయంటే..
తెలంగాణలో గ్రూపు-1 మెయిన్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 వరకూ జరిగాయి. మెుత్తం 563 పోస్టులకు గానూ 31,403 (క్రీడల కోటా కలిసి) మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. అయితే జీవో 29ను రద్దు చేయాలని, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. పెద్దఎత్తున నిరసన తెలిపిన అభ్యర్థులు ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ వారికి ఎదురుదెబ్బ తగలడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. పరీక్షలు మెుదలైన రోజే కేసు విచారణకు రావడంతో పరీక్షలు నిలిపివేసేందుకు కోర్టు అనుమతి ఇవ్వలేదు. దీంతో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. అయితే విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం అభ్యర్థుల పిటిషన్లు కొట్టివేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com